మూడేళ్ల నుంచి ఊరించిన రాధేశ్యామ్ ఎట్టకేలకు ఈ రోజు థియేటర్లలోకి వచ్చేసింది. జాతకాల ప్రభాస్ జాతకం ఏంటో దాదాపు తేలిపోయింది. సినిమా జస్ట్ ఓకే… బాహుబలి, సాహో స్థాయిలో ఊహించుకోవద్దన్న టాక్‌తో జర్నీ స్టార్ట్ చేసింది. రాధేశ్యామ్ సినిమా ఎందుకు ఇలా తీశారు ? అని ప్రశ్నించుకుంటే దర్శకుడి వైఫల్యం ఉన్నా.. అందుకు పూర్తిగా రాధాకృష్ణ కుమార్‌ను తప్పుపట్టలేం. ఎప్పుడో ఆరేడేళ్ల క్రితం గోపీచంద్ హీరోగా యూవీ వాళ్ల బ్యానర్లో జిల్ సినిమా తీశాడు రాధాకృష్ణ కుమార్. జిల్ టేకింగ్ పరంగా కొత్తగా ఉందే కాని.. గొప్ప హిట్ సినిమాయే కాదు. అంతకు ముందు మరో రెండు సినిమాలకు రైటర్‌గా మాత్రమే పనిచేసిన అనుభవం రాధాకృష్ణది.
జిల్ టైంలో అంటే అది బాహుబలి సినిమాకు ముందు సంగతి.. అప్పుడు రాధాకృష్ణ ఎక్కువుగా యూవీ వాళ్లతోనే ఉండడంతో ప్రభాస్‌తో సాన్నిహిత్యం ఏర్పడింది. ఈ క్రమంలోనే ఆ టైంలో వైజాగ్ బ్యాక్‌డ్రాప్‌తో ఓ అందమైన లవ్‌స్టోరీ చెప్పాడు ప్రభాస్‌కు..! రాధాకృష్ణ చెప్పిన ఆ లైన్ విపరీతంగా నచ్చడంతో ఓకే చెప్పడంతో పాటు యూవీ వాళ్లతోనే కొంత అడ్వాన్స్ ఇప్పించేశాడు. అలా రాధాకృష్ణ కుమార్ అప్పుడే ప్రభాస్ సినిమాకు లాక్ అయిపోయాడు. అప్పటి నుంచి అదే యూవీ వాళ్ల దగ్గర ఉంటూ ఈ సినిమా మీదే వర్క్ చేశాడు.
మరి పామిస్ట్రీ ఎలా యాడ్ అయ్యింది ?
మరి ఈ ప్రేమకథకు పామిస్ట్రీ ఎలా యాడ్ అయ్యిందంటే ఇక్కడే మరో ట్విస్ట్ కూడా ఉంది. విభిన్న చిత్రాల దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి పామిస్ట్రీ .. జాతకాలు, డెస్టినీ అంటూ ఓ కథ రాసుకున్నాడు. లైన్ బాగుంది. యూవీ వాళ్లు విన్నారు. అయితే ఈ కథను ఆయన అమ్మేసుకున్నాడు. చివరకు రాధాకృష్ణ కుమార్ తన ప్రేమకథకు డెస్టినీ, పామిస్ట్రీ యాడ్ చేసి ఈ రాధేశ్యామ్ కథ రెడీ చేసుకున్నాడు.
వైజాగ్ లవ్ స్టోరీ… ఇటలీకి ఎందుకు వెళ్లింది…!
ఈ సినిమా కథ ప్రభాస్‌కు చెప్పినప్పుడు ప్రభాస్ ఇమేజ్ వేరు. ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయినప్పుడు ప్రభాస్ ఇమేజ్ వేరు. మధ్యలో బాహుబలి రెండు సీరిస్‌లతో పాటు సాహో సినిమా వచ్చింది. ఈ రెండు సినిమాలు ప్రభాస్ ఇమేజ్‌ను అమాంతం పెంచేశాయి. బాహుబలి 1, 2 తర్వాత ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. అందుకే సాహో సినిమాను ముందు అంత బడ్జెట్‌తో తీయాలని అనుకోకపోయినా.. ప్రభాస్ ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకుని అంత ఖర్చు చేశారు.
ఆ సినిమాకు మిక్స్‌డ్ టాక్ వచ్చినా.. తెలుగులో ప్లాపే అన్నా కూడా నార్త్‌లో ఏకంగా రు. 150 కోట్ల వసూళ్లు వచ్చాయి. ఇదంతా ప్రభాస్ ఇమేజ్ అన్నది తెలిసిందే. అందుకే ఇప్పుడు రాధేశ్యామ్ విషయంలోనూ మేకర్స్ ఎక్కడా రాజీపడలేదు. సినిమా భారీ తనం.. మారిన ప్రభాస్ ఇమేజ్ నేపథ్యంలో ఈ సినిమా బ్యాక్‌డ్రాప్ వైజాగ్ నుంచి ఇటలీ వెళ్లిపోయింది. ఇటలీలో లెక్కకు మిక్కిలిగా సెట్లు వేసి.. ఆర్ట్ వర్క్‌కు భారీగా ఖర్చు చేసి సినిమాకు భారీ తనం తీసుకువచ్చారు. అయితే అవన్నీ బాగున్నా కథ మీద మరింత కసరత్తు చేసి ఉంటే ఇంకా బాగుండేది.