టాలీవుడ్‌లో ఇటీవల వచ్చిన బాలయ్య అఖండ, ప్రభాస్ రాధేశ్యామ్ రెండూ కథాపరంగా వైవిధ్యం ఉన్నవే. అఖండలో బాలయ్య అఘోరాగా కనిపించాడు. తెలుగు సినిమా చరిత్రలో ఇప్పటి వరకు ఈ తరహా పాత్ర ఏ హీరో వేయకపోవడం ఒక ఎత్తు అయితే.. బాలయ్య లాంటి స్టార్ హీరో, అందులోనూ మాస్ ఇమేజ్ ఉన్న హీరో ఈ పాత్ర వేయడం మరో ఎత్తు. ఇక బాహుబలి సినిమాతో ప్రభాస్ ఇమేజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. అలాంటి టైంలో సాహో లాంటి అదిరిపోయే యాక్షన్ సినిమా చేశాడు.
ఈ రెండు సినిమాల తర్వాత కంప్లీట్ రొమాంటిక్ లవ్‌స్టోరీ చేశాడు. దీనికి పామిస్ట్రీ యాడ్ చేశారు. ఇక రెండు సినిమాల్లో అఖండకు కూడా ముందు రోజు నుంచే ఈ సినిమా ఆడిన రేంజ్‌తో పోలిస్తే అంత గొప్ప టాక్ రాలేదు. అయితే రెండో రోజు నుంచి అఖండ థియేటర్ల దగ్గర బాలయ్య మాస్ జాతర స్టార్ట్ అయ్యింది. అయితే రాధేశ్యామ్‌కు ఆ ఛాన్సులు కనపడడం లేదు. బాక్సాఫీస్ దగ్గర హీట్ రేఖ లేదనే వారే ఎక్కువ మంది అంటున్నారు. పైగా ఓవర్ బడ్జెట్ కూడా సినిమాకు మైనస్ అయ్యింది. ఇదే కథను ఇండియాలో ఏ హిల్ స్టేషన్ దగ్గరో తీసుకున్నా కొన్ని కోట్లు ఆదా అయ్యేవి అంటున్నారు.
అసలు అఖండ దైవభక్తి, అఘోరా నేపథ్యంలో వస్తే.. రాధేశ్యామ్ కూడా జాతకాల నేపథ్యంలో వచ్చింది. అయితే అఖండలో బోయపాటి మార్క్ భీభత్సమైన యాక్షన్ ఉంది. అసలు కొన్ని సీన్లలో లాజిక్ ఏంటో కూడా అర్థం కాదు. అయితే ఆ సినిమాను బాలయ్యకు ఉన్న భీభత్సమైన మాస్ ఇమేజ్.. యాక్షన్ ప్రియులకు మాంచి బిర్యానీ లాంటి విందు భోజనంలా ఉండడం.. కరోనా రెండో వేవ్ తర్వాత మంచి యాక్షన్ సినిమా కోసం ప్రేక్షకులు ఆకలిమీద ఉండడం ఇవన్నీ ఆ లోపాలను కప్పేసి ప్రేక్షకులు అఖండ యాయలో కొట్టుకుపోయేలా చేశాయి.
రాధేశ్యామ్‌లో మాంచి ప్రేమకథే అయినా ప్రభాస్ ఫ్యాన్స్‌ను మెప్పించే యాక్షన్ సీన్లే లేవు. పైగా మాస్ డైలాగులు కూడా లేవు. బాహుబలి తర్వాత ప్రభాస్‌ను ఆయన అభిమానులు, సినీ లవర్స్ ఓ పోరాట యోధుడిలా, ఓ యాక్షన్ హీరోగా చూస్తున్నారు. అవేవి ఇందులో లేవు. ఇక అఖండలో చెప్పుకోదగ్గ విశేషాలు చాలానే ఉన్నాయి. ధర్మం, మతం కోణంలో మంచి డైలాగులు ఉన్నాయి.. అవి బాలయ్య చెప్పడంతో పేలాయి. ఇంకా చెప్పాలంటే అఖండ క్యారెక్టర్‌ను బాలయ్య మాత్రమే చేయగలడు.. ఇంకెవ్వరు చేయలేరు అన్నంత టాక్ వచ్చేసింది. అసలు థియేటర్లలో బాలయ్య వన్ మ్యాన్ షోకు తోడు.. ఆయన యాక్టింగ్‌కు బాలయ్య అభిమానులే కాదు.. మాస్ జనాలు కూడా పూనకాలతో ఊగిపోయారు.
ఇక రాధేశ్యామ్‌కు బ్రహ్మాండమైన విజువల్స్ ఉన్నా కథ కన్విన్సింగ్‌గా లేకపోతే వేస్ట్. అదే ఇక్కడ కనిపించింది. ఓ మాంచి బ్రహ్మాండమైన.. ఇంకా చెప్పాలంటే ప్రపంచంలోనే పెద్ద గోప్ప హోటల్‌కు భోజనానికి వెళ్లాం. అదిరిపోయే ఫర్నీచర్… బ్రహ్మాండమైన ఆర్ట్ వర్క్… సకల రాజమర్యాదలు ఉండి కూడా భోజనం బాగోలేకపోతే మన ఫీలింగ్ ఎలా ఉంటుందో ? రాధేశ్యామ్ కూడా అలాగే ఉంది. అఖండలో లోపాలున్నా బాలయ్య యాక్షన్‌తో అవి కవర్ అయిపోయాయి.. రాధేశ్యామ్‌లో ప్రభాస్ మ్యానేజ్ చేయలేకపోయాడు. అసలు తన ఇమేజ్‌కు ఈ కథ సూట్ కాకపోవడం కూడా మరో మైనస్ అయ్యింది.