మెగాస్టార్ చిరంజీవి – ఆయన తనయుడు మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ తేజ్ కలిసి నటించిన తాజా సినిమా ఆచార్య. మూడేళ్ల పాటు సినిమా షూటింగ్‌లోనే ఉన్న ఈ సినిమా ఎట్టకేలకు వచ్చే నెల 29న థియేటర్లలోకి వస్తోంది. ధర్మస్థలి నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్, చరణ్ పక్కన పూజా హెగ్డే హీరోయిన్లుగా నటించారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్స్, సింగిల్స్, స్టిల్స్ సినిమాపై భారీ అంచనాలు నెలకొల్పాయి.
ఇక దేవాలయ భూముల కుంభకోణం చుట్టూ ఈ సినిమా కథ ఉంటుందని.. సమకాలీన అంశాలను మేళవించి దర్శకుడు కొరటాల శివ ఈ సినిమాను తెరకెక్కించాడని అంటున్నారు. ఈ సినిమా దర్శకుడు కొరటాల శివ ఇప్పటి వరకు అపజయం అన్నదే ఎదుర్కోలేదు. మిర్చి – శ్రీమంతుడు – జనతా గ్యారేజ్ – భరత్ అనే నేను సినిమాలతో వరుసగా హిట్లు కొట్టాడు. వరుసగా నాలుగు హిట్లు కొట్టిన కొరటాల ఇప్పుడు వరుసగా ఐదో హిట్ తన ఖాతాలో వేసుకునేందుకు పట్టుదలతో ఉన్నాడు.
పైగా మెగాస్టార్ చిరంజీవి – కొరటాల కాంబినేషన్ కావడంతో ట్రేడ్ వర్గాల్లోనూ ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఒక్క నైజాం రైట్స్‌నే వరంగల్ శ్రీను దాదాపు రు. 42 కోట్లకు సొంతం చేసుకోవడంతో ట్రేడ్ వర్గాల్లోనూ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. సీడెడ్, ఉత్తరాంధ్ర ఏరియాల రైట్స్ కూడా భారీ రేట్లకు అమ్ముడుపోయాయి. ఇక తాజా అప్‌డేట్ ప్రకారం ఆచార్య రన్ టైం ఫిక్స్ అయ్యిందట.
ఈ సినిమా రన్ టైం 3 గంటల పాటు ఉండేలా ఫిక్స్ చేశారట. మూడు గంటల పాటు రన్ టైం అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో కాస్త ఎక్కువే అనుకోవాలి. అయితే కొరటాల 3 గంటల పాటు ప్రేక్షకులకు బోర్ లేకుండా సినిమాను మెస్మరైజ్ చేసేలా తెరకెక్కించారని ఆచార్య యూనిట్ వర్గాలు ధీమాతో ఉన్నాయి. సైరా నరసింహారెడ్డి తర్వాత చిరు నటించిన సినిమా ఇదే కావడంతో ఈ సినిమా కోసం మెగా అభిమానులు వెయిటింగ్‌లో ఉన్నారు.