ఓ అద్భుతమైన, అత్యధ్భుతమైన కథ… బాలయ్య హీరో.. ఆయనకు కలిసొచ్చిన విజయశాంతి హీరోయిన్. హాలీవుడ్ రేంజ్ టెక్నాలజీ..! అయితే భారీ బడ్జెట్.. అప్పుడున్న పరిస్థితుల్లో అది కొంచెం ఎక్కువే. ఇంకేముందు విజయశాంతి.. తన భర్త శ్రీనివాస ప్రసాద్‌తో కలిసి తానే ఈ సినిమా నిర్మించేందుకు ముందుకు వచ్చారు. బాలయ్య డేట్లు ఇచ్చాడు. కోదండ రామిరెడ్డి దర్శకుడు. బాలయ్య బిరుదు అయిన యువరత్న ఆర్ట్స్ అనే బ్యానర్ స్థాపించి సినిమా నిర్మించాలని విజయశాంతి డిసైడ్ అయ్యింది. అయితే విజయశాంతి ఈ సినిమా నిర్మించడానికి ముందుకు వచ్చాక బాలయ్యకు కథ చెప్పగా ఆయన ఓకే చేశారు. అయితే హీరోయిన్‌గా ముందు దివ్యభారతిని అనుకున్నారు.
1990లో వచ్చిన వెంకటేష్ బొబ్బిలి రాజా సినిమా సూపర్ హిట్ అయ్యింది. దివ్యభారతి క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఆమెకు వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్సులు వచ్చాయి. ఇంకేముంది.. ఆమె డేట్లు దొరకలేదు. మరి హీరోయిన్‌గా ఎవరిని తీసుకోవాలి ? అన్న తర్జన భర్జనలు జరిగాయి. చివరకు విజయశాంతే హీరోయిన్ అనుకున్నారు. అప్పటికే విజయశాంతి – బాలకృష్ణది బ్లాక్‌బస్టర్ కాంబినేషన్. దీంతో ఆమె ఉంటే సినిమాకు మరింత క్రేజ్ వస్తుందనుకున్నారు. బడ్జెట్ లెక్కలేస్తే ఖర్చు అప్పట్లోనే రు. 3 కోట్లు దాటేసింది. చివరకు విజయశాంతి అంత బడ్జెట్ భరించలేనని చెప్పడంతో చివరకు బాలయ్య కూడా ఓ నిర్మాతగా మారారు. అందుకే తన బిరుదు పేరు మీదే యువరత్న ఆర్ట్స్ స్థాపించారు.
సినిమా షూటింగ్ 1991లో చెన్నైలోని ఏవీఎం స్టూడియోలో ప్రారంభించారు. ఈ సినిమా ప్రారంభోత్సవానికి తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్, మళయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ ఇద్దరూ హాజరయ్యారు. పరుచూరి సోదరులు అదిరిపోయే కథ రెడీ చేసి దర్శకుడు కోదండ రామిరెడ్డికి ఇచ్చారు. అయితే కర్త్యవం సినిమాతో విజయశాంతి పాపులారిటీ పెరిగి.. హీరోలతో సమానంగా రెమ్యునరేషన్ డిమాండ్ చేసే స్థాయికి వెళ్లింది. దీంతో తనకు కూడా హీరో బాలయ్యకు ధీటుగా సరిసమానమైన పాత్ర ఉండాలని.. అందుకు అనుగుణంగా కథలో మార్పులు, చేర్పులు చేయాలని దర్శకుడు కోదండ రామిరెడ్డిపై ఒత్తిడి చేయడం ప్రారంభించిందట.
అయితే చాలా పక్కాగా రాసిన స్క్రిఫ్ట్‌ను మారిస్తే ఇబ్బంది అవుతుందని పరుచూరి సోదరులు ఎంత చెప్పినా కూడా విజయశాంతి వినకుండా.. తనకు అనుగుణంగా సీన్లు రాయాలని కోరేవారన్న టాక్ ఉంది. ఆ తర్వాత చెన్నైలోని ఏవీఎం, వాహిని, హైదరాబాద్‌లోని రామానాయుడు, సారథి, అన్నపూర్ణ, పద్మాలయ స్టూడియోలో ఈ సినిమా షూటింగ్ జరుపుకుంది. బొగ్గు గనుల ఫ్యాక్టరీ కోసం సింగరేణి ప్రాంతంలో పెద్ద సెట్ వేశారు. అయితే ఆ బొగ్గు గనుల ప్రాంతంలోకి భారీగా నీళ్లు వచ్చే టైంలో ముగ్గురు ప్రమాద వశాత్తు మృతి చెందారని.. కొందరికి గాయాలు అయ్యాయన్న వార్తలు వచ్చాయి. ఫైట్ మాస్టర్ కూడా మృతిచెందాడు.
అయితే ఈ విషయాన్ని సినిమా యూనిట్ బయటకు చెప్పలేదు. చివరక మృతిచెందిన వారి కుటుంబాలు కోర్టులకు వెళ్లడంతో సినిమా షూటింగ్ ఆగిపోయింది. చివరకు రిలీజ్ డేట్ కూడా వాయిదా పడింది. ఏకంగా రెండు సంవత్సరాలకు పైగా షూటింగ్ జరుపుకుంది. అనుకున్న దానికంటే బడ్జెట్ ఎక్కువైంది. వడ్డీలు కూడా పెరిగిపోయాయి. ఇక కథలో మార్పులు చేయాలని విజయశాంతి కోరడం బాలయ్యకూ నచ్చలేదు. ఈ క్రమంలోనే వారి మధ్య మనస్పర్థలు వచ్చాయి. ఆ తర్వాత వీళ్లు కలిసి నటించలేనంతగా ఇవి పెరిగిపోయాయి.
ఈ సినిమా షూటింగ్ ఆగిపోవడంతో దర్శకుడు కోదండ రామిరెడ్డి చిరంజీవితో ముఠామేస్త్రికి కమిట్ అయ్యారు. దీంతో ఈ సినిమా మరింత లేట్ అయ్యింది. ఓ రెండు పాటలను అయితే పరుచూరి బ్రదర్స్ ఊటి, ఆస్ట్రేలియాలో షూట్ చేశారు. చివరకు ముఠామేస్త్రి షూటింగ్ అయ్యాక కోదండ రామిరెడ్డి ఫ్రీ అవ్వడంతో అప్పుడు తిరిగి నిప్పురవ్వ షూటింగ్ జరిగింది. సినిమా లేట్ అవ్వడంతో కొన్ని పాటలను స్వరపర్చిన మ్యూజిక్ డైరెక్టర్ బప్పీలహరి బాలీవుడ్‌లో బిజీ అయిపోయాడు. చివరకు రండి రండి కదలిరండి అనే పాటను రాజ్ కోటి స్వరపర్చారు.
సినిమా చాలా లేట్ అవ్వడంతో పాటు విజయశాంతి కథలో మార్పులు కోరడంతో బాలయ్య రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో బంగారు బుల్లోడుకు వెళ్లిపోయాడు. 1993 సంక్రాంతికి సినిమా రిలీజ్ చేస్తామని ప్రకటించారు. బయ్యర్లు అడ్వాన్సులు కూడా ఇచ్చారు. చివరకు 1993 విజయదశమి కానుకగా సెప్టెంబర్ 3వ తేదీన ఈ సినిమా రిలీజ్ చేస్తున్నట్టు దర్శక నిర్మాతలు ప్రకటించారు. చివరకు బంగారు బుల్లోడు రిలీజ్ డేట్ కూడా అదే అయ్యింది. అలా ఒకే రోజు రెండు బాలయ్య సినిమాలు వచ్చాయి.
ఎవ్వరూ వెనక్కు తగ్గలేదు. బాలయ్య అభిమానులు కూడా ఏ సినిమా చూడాలి.. ఎక్కడ హంగామా చేయాలో తెలియక షాక్ అయ్యారు. ఒక్క హైదరాబాద్‌లోనే ఏకంగా 50 థియేటర్లలో బాలయ్య సినిమాలు ఆడాయి. అప్పట్లో ఇదో రికార్డు. అయితే నిప్పురవ్వ సినిమాకు భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. లాంగ్‌రన్‌లో మాత్రం బంగారు బుల్లోడు సక్సెస్ సాధించింది. చివరకు నిప్పురవ్వ సినిమాకు పెట్టిన ఖర్చు ఆ సినిమా రాబట్టేలుదు. ఈ సినిమాకు ఏఆర్. రెహ్మన్ నేపథ్య సంగీతం అందించారు.