టైటిల్: ఖిలాడి
నటీనటులు: రవితేజ-డింపుల్ హయతి-మీనాక్షి చౌదరి-అర్జున్-ముఖేష్ రుషి-అనూప్-మురళీ శర్మ-రావు రమేష్-వెన్నెల కిషోర్-అనసూయ తదితరులు
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
ఛాయాగ్రహణం: సుజీత్ వాసుదేవన్-జీకే విష్ణు
మాటలు: శ్రీకాంత్ విస్సా
నిర్మాత: కోనేరు సత్యనారాయణ
కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: రమేష్ వర్మ
రిలీజ్‌డేట్: 11 మార్చి, 2022
గతేడాది క్రాక్ లాంటి బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత ఫుల్ ఫామ్‌లోకి వచ్చిన మాస్ మహరాజ్ రవితేజ ఈ యేడాది ఖిలాడి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. రాక్షసుడు లాంటి హిట్ తర్వాత రమేష్‌వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ రోజు రిలీజ్ అయ్యింది. మరి ఖాలాడితో రవితేజ ప్రేక్షకుల అంచనాలు అందుకున్నాడా ? లేదా ? అన్నది TL సమీక్షలో చూద్దాం.
కథ:
అనాథ అయిన గాంధీ (రవితేజ)ను చేరదీసిన రాజశేఖర్ ( రావు రమేష్) అంటే గాంధీకి ఎంతో ఇష్టం. అయితే హోం మినిస్టర్ గురుసింగం (ముఖేష్ రుషి), సీఎంకు సంబంధించిన పదివేల కోట్ల డబ్బుల విషయంలో రాజశేఖర్‌తో పాటు గాంధీ కుటుంబం కూడా ఇరుక్కుపోతుంది. ఈ క్రమంలోనే గాంధీ భార్యతో పాటు అత్త, మామలు కూడా చనిపోతారు. ఈ కేసులో గాంధీ జైలుకు వెళతాడు. ఈ క్రమంలోనే గాంధీ కుమార్తెను కాపాడేందుకు సైకాలజీ స్టూడెంట్ అయిన పూజ ( మీనాక్షి చౌదరి) పిటిషన్ వేసి గాంధీకి బెయిల్ వచ్చేలా చేస్తుంది. ఈ టైంలో గాంధీ నిజం స్వరూపం తెలియడంతో పూజ షాక్ అవుతుంది ? అసలు గాంధీ ఎవరు ? ఆ పదివేల కోట్ల డబ్బుతో గాంధీకి ఉన్న లింక్ ఏంటి ? చివరకు ఏం జరిగింది ? అన్నదే ఈ సినిమా కథ.
TL విశ్లేషణ :
ఖిలాడీ ఫస్టాఫ్‌లో గంట వరకు జీవం లేకుండా సాగుతూ ఉంటుంది. రవితేజ అంటేనే ఎనర్జీ, డైలాగులు, మాస్‌లో జోష్ తెప్పించే డైలాగులు మనం ఆశిస్తాం. రవితేజ ఏంటి ఇంత నీరసంగా, డీలా ఉండడం ఏంటి అని అభిమానులు నిరుత్సాహంతో ఉన్న టైంలో ఇంటర్వెల్ టైంలో ప్రేక్షకులను పూల్స్ చేస్తూ చిన్న ట్విస్ట్ ఇచ్చారు. ఫస్టాఫ్‌లో మనం చాలా వరకు డార్లింగ్ సినిమా చూస్తాం. ఇక సెకండాఫ్‌కు వచ్చే సరికి అయినా కథ గాడిలో పడి కాస్త ఇంట్రస్టింగ్‌గా మారుతుందని అనుకుంటే.. ఇక్కడ హిందీ రేస్ సినిమాను దించేశారు.
రేస్ సినిమాలోలా ఇక్కడ డబ్బుల కోసం ఒకరిని మరొకరు మోసం చేసుకునే పాత్రలో సెకండాఫ్ అంతా కనిపిస్తాయి. డబ్బుల కోసం ఎవరిగేమ్ వాళ్లు ఆడేస్తూ ఉంటారు. పావుగంటకో ట్విస్ట్ అన్నట్టుగా ఉంటుంది. హీరో ఏది అనుకుంటే అది చేసుకుంటూ వెళ్లిపోతూ ఉంటాడు. అతడికి బలమైన ప్రతిఘటన, ఛాలెంజ్‌లే ఉండవు. థ్రిల్ కలిగించాల్సిన ట్విస్టులు ఇక్కడ కామెడీగా మారిపోయాయి.
విలన్ జైలుకువెళ్లడం.. రావాలనుకున్నప్పుడు వచ్చేయడం.. ఓ హ్యాకింగ్ నిపుణుడిని పక్కన పెట్టేసి.. ఫారిన్లో ఉన్న విలన్ డెన్లోకి మనిషిని పంపేయడం.. నిమిషాల్లోనే పదివేల కోట్ల రూపాయల ఆచూకీ కనిపెట్టేయడం.. ఇలా విలన్లతో సంబంధం లేకుండా హీరోనే గేమ్ ఆడేస్తూ ఉంటాడు. ఇలా రొటీన్ కథనాలతోనే ఖిలాడీ నడుస్తుంది.
అయితే మాస్ ప్రేక్షకులు ఆశించే అంశాలను ఈ సినిమాలో లోటు లేదు. ఇక లాజిక్స్ పక్కన పెట్టేస్తే సినిమాలో ట్విస్టులు ఉంటాయి. ఇంటర్వెల్ తర్వాత మాస్ రాజా రవితేజ బాగా ఎనర్జీతో కనిపించాడు. రవితేజ మేనరిజం, ఫైట్లు, చేజింగ్‌లు మాస్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయి. హీరోయిన్లు ఇద్దరూ పోటీపడి అందాలు ఆరబోశారు. వీరికి తోడు అనసూయ సైతం తన వంతు గ్లామర్ విందు చేసింది.
టెక్నికల్‌గా ఎలా ఉందంటే..
దేవీశ్రీ ప్రసాద్ ఈ నాన్ సీరియస్ ఫిలింకు మొక్కుబడిగా పాటలు, ఆర్ ఆర్ లాగించేసినట్టుగా ఉంది. పాటలు ఏవీ గుర్తుండేలా లేవు. ఆర్ ఆర్ కమర్షియల్ సినిమాల స్టైల్లో ముగించేశాడు. విజువల్స్ బాగున్నాయి. శ్రీకాంత్ విస్సా మాటల్లో మెరుపు లేదు. నిర్మాణ విలువలకు వంక పెట్టలేం. నిర్మాతలు ఖర్చుగా రాజీపడకుండా ఖర్చు పెట్టారు. దర్శకుడు రమేష్ వర్మ పలు సినిమాల నుంచి స్ఫూర్తి తీసుకుని కథ రాసుకున్నారు. థ్రిల్లర్ కథ కామెడీగా తీయడంతో కిచిడీ అయ్యింది.
ఫైనల్‌గా….
ఓవరాల్‌గా చెప్పాలంటే దర్శకుడు రమేష్‌శర్మ కమర్షియల్ మీటర్‌ను చాలా వరకు బాగానే ఫాలో అయ్యాడు. కథ, కథనాలను సీరియస్‌గా తీసుకుంటే ఖిలాడి అంచనాలు అందుకోలేదు. అవన్నీ పక్కన పెట్టేస్తే ఖిలాడి ఓకే అనిపిస్తుంది. సినిమాకు కీలకమైన సెకండాఫ్, క్లైమాక్స్‌లో డైరెక్షన్ లోపం కనిపిస్తుంది. అందుకే ఖిలాడి యావరేజ్ మీటర్‌కు కిందే ఆగిపోయింది. రవితేజ ఫ్యాన్స్‌కు కిక్ ఇచ్చే సినిమా మిగిలిన సినిమా ఫ్యాన్స్‌కు జస్ట్ ఓకే.
ఖిలాడి TL రేటింగ్ : 2.25 / 5