టైటిల్: భీమ్లానాయక్
బ్యానర్: సితారా ఎంటర్టైన్‌మెంట్
నటీనటులు: పవన్‌కళ్యాణ్ – దగ్గుబాటి రానా – నిత్యామీనన్ – సంయుక్త మీనన్ –
కథ మూలం: అయ్యప్పనుం కోషియమ్ (మళయాళ రీమేక్)
సినిమాటోగ్రఫీ: రవి కె. చంద్రన్
ఎడిటింగ్: నవీన్ నూలీ
మ్యూజిక్: థమన్. ఎస్
నిర్మాత: సూర్యదేవర నాగవంశీ
స్క్రీన్ ప్లే, సంభాషణలు: త్రివిక్రమ్ శ్రీనివాస్
దర్శకత్వం: సాగర్ కె. చంద్ర
సెన్సార్ రిపోర్ట్: యూ / ఏ
రన్ టైం: 145 నిమిషాలు
ప్రి రిలీజ్ బిజినెస్ – 108 కోట్లు (వరల్డ్ వైడ్)
రిలీజ్ డేట్: 25 ఫిబ్రవరి, 2022
వకీల్‌సాబ్‌తో రీ ఎంట్రీ ఇచ్చిన పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ వరుసపెట్టి సినిమాలు ఓకే చేస్తున్నారు. గతేడాది బాలీవుడ్ పింక్ రీమేక్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన పవన్ ఈ యేడాది మరోసారి మల్లూవుడ్ రీమేక్ అయ్యప్పనుం కోషియమ్ రీమేక్ భీమ్లానాయక్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఇప్పటికే అక్కడ హిట్ అయిన కథకు తోడు దగ్గుబాటి రానాతో కూడా నటిస్తోన్న మల్టీస్టారర్ కావడం, టీజర్లు, ట్రైలర్లతో పెరిగిన అంచనాలు, త్రివిక్రమ్ స్క్రీన్‌ప్లే, సంభాషణలు, భారీ ప్రి రిలీజ్ బిజినెస్.. ఓవైపు ఏపీలో జగన్ సర్కార్ అడుగడుగునా అడ్డంకుల నేపథ్యంలో ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమాకు సాగర్ కె. చంద్ర దర్శకుడు. మరి భీమ్లానాయక్‌తో పవన్ కళ్యాణ్ తన సత్తా చాటాడా ? మళయాళంలో మ్యాజిక్ తెలుగులో కూడా రిపీట్ చేసిందా ? లేదా ? అన్నది TL సమీక్షలో చూద్దాం.
TL భీమ్లానాయక్ కథ:
భీమ్లా నాయక్ (పవన్ కళ్యాణ్) కర్నూలు జిల్లాలో నిజాయితీపరుడైన సబ్ ఇన్‌స్పెక్టర్‌గా పని చేస్తూ ఉంటాడు. ఓ రోజు రిటైర్ట్ ఆర్మీ మేన్ డేనియల్ శేఖర్ ( రానా దగ్గుబాటి) మద్యం బాటిల్స్ రవాణా చేస్తుండగా పట్టుకుంటాడు. డాని అహం దెబ్బతినడంతో వారి మధ్య మాటల యుద్ధం కాస్తా వారు కోపంతో రగిలిపోయి ఒకరినొకరు చంపుకునే వరకు వెళుతుంది. భీమ్లా నాయక్‌పై డానీ తన ప్రతీకారం తీర్చుకునేందుకు ఏం చేశాడు ? డానీకి నాయక్ ఎలా సమాధానం చెప్పాడు ? అన్నదే ఈ సినిమా కథ.
విశ్లేషణ :
ఇద్దరు వ్యక్తుల మధ్య అహం, ఘర్షణలు తలెత్తితే వారిద్దరు చివరకు ఏ పంతాలకు పోయారు ? అన్నదే ఈ సినిమా మెయిన్ లైన్. అయ్యప్పనుమ్ కోషియమ్‌లో పోరాటాల కంటే వారి మధ్య మాటల తూటాలే పేలుతాయి. భీమ్లానాయక్ ఫస్టాఫ్‌లో కూడా పవన్ వర్సెస్ రానా మధ్య అలాగే మాటల తూటాలు పేలేలా తెరకెక్కించారు. ఫస్టాఫ్ అంతా డీసెంట్‌గా నడుస్తుంది. ప్రీ క్లైమాక్స్‌తో సినిమాకు మంచి ఊపు తెప్పించారు. పవన్ మాస్ అప్పీల్, యాక్షన్‌కు రానా ధీటైన పోటీ ఇచ్చే సీన్లు కేకలు పెట్టిస్తాయి.
సెకండాఫ్‌లో తెలుగు నేటివిటికి అనుగుణంగా మార్చిన కథ, సీన్లు ఒరిజినల్ స్క్రిఫ్ట్‌కు భిన్నంగా ఉంటాయి. ఇక సినిమాలో తెలుగు ప్రేక్షకులు మెచ్చే మాస్ అంశాలు పుష్కలంగా ఉన్నాయి. ఫ్రీ క్లైమాక్స్ ట్విస్ట్‌తో పాటు భారీ ఫ్లాష్‌బ్యాక్ ఆకట్టుకుంటాయి. ఒక్కోసారి పవన్ కళ్యాణ్ డైలాగ్ డెలివరీ, అతడి మేనరిజమ్స్ బద్రి సినిమా టైంలోని పవన్‌ను గుర్తుకు చేస్తాయి. రానాకు కూడా మంచి పాత్ర దొరికింది. మల్టీస్టారర్ సినిమాలకు రానా కరెక్ట్ మ్యాచింగ్.
ఇక పవన్ భార్యగా నిత్యామీనన్ నటనతో పాటు ఆమె డైలాగ్ డెలివరీ, మేనరిజమ్ కొత్తగా ఉంది. ఇక రానాకు జోడీగా నటించిన సంయుక్తమీనన్‌తో పాటు మురళీశర్మ, రావూ రమేష్ తమ పాత్రల వరకు ఓకే. సినిమాలో ఎన్ని పాత్రలు ఉన్నా రానా – పవన్ సీన్లే ఎక్కువుగా ఉంటాయి. హీరోయిన్లు ఇద్దరూ ఎమోషనల్ సీన్లలో చేసిన నటన సూపర్బ్. ఇక డైలాగ్స్ మరియు స్క్రీన్ ప్లేలో త్రివిక్రమ్ మార్క్ కనిపిస్తుంది. సంగీత దర్శకుడు థమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సెకండాఫ్‌లో అదరగొట్టేసింది. ఎడిటింగ్ క్రిస్పీగా ఉండడం ఈ సినిమా మేజర్ ప్లస్ పాయింట్స్‌లో ఒకటి.
ఇక ట్రైలర్‌లో బీజీఎం చూసి డిజప్పాయింట్ అయిన వాళ్లంతా సినిమా చూశాక హ్యాఫీగా ఉంటారు. సితార ఎంటర్టైన్‌మెంట్ నిర్మాణ విలువలు బాగున్నాయి. సూర్యదేవర నాగవంశీ ఎక్కడా రాజీపడకుండా పర్‌ఫెక్ట్ మేకింగ్ అందించారు. దర్శకుడు సాగర్ కె. చంద్ర త్రివిక్రమ్ ఇచ్చిన స్క్రీన్ ప్లేను పక్కాగా.. ఫర్‌ఫెక్ట్‌గా ఫాలో అవుతూ తనదైన టేకింగ్‌తో మంచి నటన రాబట్టుకున్నాడు. కొన్ని సీన్లను ఇంకాస్త బెటర్‌గా డిజైన్ చేసుంటే బాగుండేది అనిపించింది. అయితే పవన్ పాత్రకు, సంయుక్త మీనన్‌కు లింకు పెట్టిన తీరు పూర్తిగా సినిమాటిక్‌గా ఉంది. ఇక కొన్ని చోట్ల స్లో నెరేషన్ ఇబ్బంది పెడుతుంది.
ప్లస్ పాయింట్స్ ( +) :
– పవన్ వర్సెస్ రానా పోటాపోటీ నటన, వాళ్లిద్దరి వార్
– ఇంటర్వెల్ .. ఫైట్ ఎపిసోడ్లు
– ఆకట్టుకునే, పేలిన పంచ్ డైలాగులు
– క్రిస్పీ రన్ టైం… ఎడిటింగ్
– థమన్ నేపథ్య సంగీతం
మైనస్ పాయింట్స్ ( -) :
– యాక్షన్ ఎపిసోడ్స్ కాస్త ఓవర్ డోస్
– సెకండాఫ్‌లో కాస్త స్లో అవ్వడం
ఫైనల్‌గా..
భీమ్లానాయక్ అనేది ఒక కమర్షియల్ ప్లాట్. పవన్ కళ్యాణ్ – రానా మధ్య ఆత్మగౌరవం వర్సెస్ అహకారం పోరులో జరిగే ఘర్షణ, వీరిద్దరి మధ్య సీన్లు, డైలాగులు సినిమాకే హైలెట్. ఓవరాల్‌గా బాక్సాఫీస్ పోరులో భీమ్లానాయక్ పర్‌ఫెక్ట్ కమర్షియల్ విన్నర్.
భీమ్లానాయక్ TL రేటింగ్: 3.25 / 5