అచ్చు తాతకు తగ్గ రూపం… నటనలో ఆ నందమూరి తారక రాముని అనుకరణ… డైలాగుల లోనూ, డ్యాన్స్ లోనూ తిరుగులేని ఎనర్జీ టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ సొంతం. నటనలో సీనియర్ ఎన్టీఆర్ ఎంత పట్టుదలతో ఉండేవారో… జూనియర్ ఎన్టీఆర్‌లోనూ అంతే పట్టుదల కనిపిస్తోంది. అందుకే సినిమాల్లోకి వచ్చిన ఒకటి రెండు సంవత్సరాల్లోనే తెలుగు జనాల మదిలో నిలిచి.. తెలుగులో స్టార్డమ్ తెచ్చుకున్నాడు. స్టూడెంట్ నెంబర్ వన్ – సింహాద్రి సినిమాలు వచ్చినప్పుడు ఎన్టీఆర్ కెరీర్ పీక్ స్టేజ్లో ఉంది. ఎన్టీఆర్ సినిమా వస్తుంది అంటే టాలీవుడ్ తో పాటు యావత్ ఆంధ్రదేశం అంతా షేక్ అయిపోయేది. సింహాద్రి తర్వాత మాస్ జనాల్లో ఎన్టీఆర్ కు విపరీతమైన క్రేజ్ పెరిగిపోయింది.’
ఎన్టీఆర్ సినిమా రిలీజ్ అవుతోంది అంటే చాలు డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లు, చివరకు థియేటర్ యజమానులు సైతం ఎన్టీఆర్ సినిమా తమ థియేటర్లో రిలీజ్ అయితే తమకు గౌరవం ఉంటుందని పోటీపడి మరి ఆ సినిమాను కొనుగోలు చేసేవారు. అప్పుడెప్పుడో సీనియర్ ఎన్టీఆర్ లవకుశ సినిమాతో పాటు 1990 దశకం వరకు మంచి సినిమాలు వచ్చినప్పుడు జనాలు ఎడ్ల బళ్లు వేసుకుని సినిమా హాల్ లోకి వచ్చి సినిమా చూసే వారు. మళ్లీ అలాంటి ట్రెండ్ ఎన్టీఆర్ సింహాద్రితో ( ఇటీవల బాలయ్య అఖండతో కూడా ) క్రియేట్ చేశాడు. ఆ టైంలో ఎన్టీఆర్ యావరేజ్ సినిమాలకు కూడా అదిరిపోయే వసూళ్లు వచ్చేవి.
ఆది తర్వాత ఎన్టీఆర్ నటించిన అల్లరి రాముడు, మెగాస్టార్ చిరంజీవి ఇంద్ర సినిమాకు పోటీగా రిలీజ్ అయింది. ఇంద్ర సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. అల్లరి రాముడు సినిమా అబౌవ్ యావరేజ్‌గా ఆడింది. అయినా ఈ సినిమాకు ఉన్న వారందరూ భారీ లాభాలు సొంతం చేసుకున్నారు ఒక సందర్భంలో అల్లరిరాముడు నిర్మాత, ఫ్రెండ్లీ మూవీస్ అధినేత చంటి అడ్డాల అయితే అల్లరి రాముడు సినిమాకు తనకు వచ్చిన డబ్బులు లెక్క పెట్టుకోవటానికి చేతులు కూడా నొప్పి పెట్టాయని చెప్పారంటే అల్లరి రాముడు సినిమాకు ఎంత భారీ లాభాలు వచ్చాయో అర్థం అవుతోంది.
అల్లరి రాముడు సినిమా యావరేజ్ అయినా మాస్ జనాలకు పిచ్చ పిచ్చగా నచ్చేసింది. పైగా అల్లుడుగా ఎన్టీఆర్… అత్తగా నగ్మా మధ్య వచ్చే రసపట్టు సీన్లు అయితే ఓ రేంజ్ లో ఉత్సాహం ఇచ్చాయి. ఇక ఎన్టీఆర్ వరుస ఫ్లాపుల్లో ఉన్నప్పుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో రామయ్యా వస్తావయ్యా సినిమా చేశాడు. వాస్తవానికి ఆ టైంలో ఎన్టీఆర్ కెరీర్ అంత ఆశాజనకంగా లేదు. పైగా గబ్బర్‌సింగ్ లాంటి సూపర్ హిట్ సినిమాతో ఫామ్ లో ఉన్న హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన సినిమా కావడంతో రామయ్యా వస్తావయ్యా సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.
అయితే తొలి రోజే ఈ సినిమాకు మిశ్రమ స్పందన వచ్చింది. అయితే సినిమాకు మాత్రం భారీ లాభాలు వచ్చాయి. ఈ సినిమా భారీ ఓపెనింగ్స్ సొంతం చేసుకుంది. నిర్మాత దిల్ రాజు ప్రెస్ మీట్ పెట్టి సినిమా తాననుకున్న అంచనాలు అందుకోలేకపోయినా… తమకు మాత్రం భారీ లాభాలు తెచ్చి పెట్టిందని సంతోషం వ్యక్తం చేశారు. ఏదేమైనా మరి శక్తి ఇలాంటి సినిమాలను మినహాయిస్తే ఎన్టీఆర్ సినిమాలు యావరేజ్, ప్లాప్ అయినా కూడా నిర్మాతలకు భారీ లాభాలు తెచ్చి పెట్టాయి అనేందుకు ఈ రెండు సినిమాలే నిదర్శనం.