విశ్వవిఖ్యాత నటసార్వభౌముడిగా పేరొందిన అన్నగారు ఎన్టీఆర్ చేయని సినిమా లేదని అంటారు. సినీ రంగంలో ఆయన వేయని అడుగు కూడా లేదు.. కృష్ణుడిగా, రాముడిగా, అర్జనుడిగా.. పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామిగా.. ఇలా అనేక చారిత్రక సినిమాల్లో ఆయన నటించారు. ఇక, కొన్నింటిని ఆయనే స్వయంగా నిర్మించుకున్నారు. శ్రీనాధ కవి సార్వభౌమ వంటి కవుల చిత్రాలనూ ఆయన కథానాయకుడిగా రక్తి కట్టించారు. సాఘింక సినిమాలకు కొదవే లేదు. అయితే.. ఇన్ని చేసినా.. ఒక కళాకారుడిగా.. అన్నగారిలో ఒక ప్రత్యేకమైన అసంతృప్తి ఎప్పుడూ కనిపించేది.
ఎన్నో ఎన్నెన్నో చిత్రాల్లో నటించిన అన్నగారు.. ఒకే ఒక చారిత్రక చిత్రంలో నటించలేకపోవడం ఆయన నట జీవితంలో పెద్ద వెలితిగా పేర్కొనేవారు. చివరికంటా ఆయన ఈ సినిమాను తీయాలని.. తన నటనతో ప్రేక్షకులను మెప్పించాలని ఆశించారు. ఈ క్రమంలో అడుగులు పడుతున్నప్పుడు.. రాజకీయాల్లోకి రావడం.. వెంటనే పార్టీ పెట్టడం అధికారంలోకి రావడం వంటివి జరిగిపోయాయి. దీంతో అన్నగారి కల నెరవేరలేదు. ఇంతకీ ఆయన కల ఏంటంటే.. `వేమన` చిత్రంలో వేమనగా నటించడం. గతంలో ఈ సినిమాను.. చిత్తూరు వీ నాగయ్య తీశారు. ఆ చిత్రాన్ని చూసిన అన్నగారు.. ఆయనలాగే వేమన చిత్రాన్ని తీసి.. రక్తి కట్టించాలని కలలు కన్నారు.
అయితే.. అది సాధ్యం అవుతుందని అనుకునేలోగానే.. అన్నగారు.. అధికారంలోకి వచ్చారు. అయినప్పటికీ ఆయన మనసు వేమన చిత్రంపైనే ఉంది. దీనికి సంబంధించి.. ఆయన అధికారంలో ఉండగానే.. ప్రముఖ దర్శకులు బాపు, రచయిత ముళ్లపూడి వెంకట రమణలతో చర్చించారు. వారు అన్నగారి ఆదేశాల మేరకు వేమన స్క్రిప్టు రెడీ కూడా చేసుకున్నారు.. ఇంతలోనే.. నాదెండ్ల భాస్కరరావు ఎఫెక్ట్‌తో ప్రభుత్వం పడిపోవడం.. రాజకీయ కారణాలు రావడంతో అన్నగారు.. ఆ ప్రాజెక్టును మరిచిపోయా రు. తర్వాత కవిసార్వభౌమ సినిమా తీసే సమయంలో.. బాపు – రమణలను మరోసారి.. వేమన చిత్రం పై చర్చించారు.
దీనికి సంబంధించి సగం కథ పూర్తయిందని వారు చెప్పారు. పూర్తి కథరాయాలని అన్నగారు ఆదేశించడంతో వారు ఆపనిలో ఉన్నారు. ఈ క్రమంలో వారికి అన్నగారు 20 లక్షల రూపాయలు ఖర్చుల కిందకూడా ఇచ్చారు. ఈ పరిణామం జరుగుతున్న క్రమంలోనే అన్నగారు మరో వివాహం చేసుకోవడం.. తదనంతర రాజకీయ పరిణామాలు మారిపోవడంతో మరోసారి ఈ సినిమా .. అటకెక్కింది. చివరకు అన్నగారి కల తీరకుండానే.. మనల్ని వదిలి వెళ్లిపోయారు. మొత్తానికి అన్నగారి జీవితంగా తీరని కల ఏదైనా ఉంటే.. అది వేమన చిత్రం తీయలేక పోవడం లేదా.. నటించలేక పోవడమే!!