మనం సినిమా వచ్చాక నందమూరి ఫ్యామిలీలో కూడా అలాంటి సినిమా రావాలని నందమూరి అభిమానులు ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. బాలయ్య – ఎన్టీఆర్, బాలయ్య – కళ్యాణ్ రామ్ లేదా ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్ కాంబినేషన్ లో ఒక్క సినిమా అయినా ఎప్పుడు వస్తుందా ? అని నందమూరి అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. ఎన్టీఆర్ బయోపిక్ లో బాలయ్యతో కలిసి కళ్యాణ్ రామ్ నటించడం తప్ప పూర్తి స్థాయిలో నందమూరి ఫ్యామిలీ హీరోల మల్టీస్టారర్ సినిమా అయితే రాలేదు. నందమూరి అభిమానులు అందరూ బాలయ్య – జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో సినిమా ఎప్పుడు వస్తుందా ? అని గత 20 సంవత్సరాలుగా ఎదురు చూస్తూనే ఉన్నారు.
ఇప్పుడు బాలయ్య – ఎన్టీఆర్ ఇమేజ్ లు వేరు వేరుగా ఉన్నాయి. వీరిద్దరి ఇమేజ్‌లను బ్యాలెన్స్ చేస్తూ మల్టీస్టారర్ సినిమా తెరకెక్కించడం అంటే ఏ దర్శకుడికి అయినా కత్తిమీద సాములాంటిదే. ఎన్టీఆర్ సినిమాల్లోకి వచ్చి స్టూడెంట్ నెంబర్ వన్ – ఆది లాంటి సూపర్ హిట్లతో జోరుమీద ఉన్న టైంలో ఎన్టీఆర్ – బాలయ్య కాంబినేషన్లో ఒక మల్టీస్టారర్ ఆలోచన జరిగింది. అయితే అది పట్టాలు ఎక్కలేదు. సీనియర్ దర్శకుడు కె.రాఘవేంద్రరావు నందమూరి ఫ్యామిలీ బాగా కావాల్సిన వ్యక్తి. సీనియర్ ఎన్టీఆర్ తో పాటు… బాలకృష్ణతో రాఘవేంద్రరావు ఎన్నో సినిమాలు తెరకెక్కించారు.
రాఘవేంద్ర రావు జూనియర్ ఎన్టీఆర్ తో నేరుగా సినిమా తెరకెక్కించలేదు. అయితే ఆయన దర్శకత్వ పర్యవేక్షణలోనే రాజమౌళి దర్శకత్వంలో స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా తెరకెక్కింది. ఎన్టీఆర్ కెరీర్లోనే స్టూడెంట్ నెంబర్ వన్ తొలి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అప్పటినుంచి రాఘవేంద్రరావు బాలయ్య – ఎన్టీఆర్ ను కలిపి ఒక సినిమా తెరకెక్కించాలని ప్రయత్నించారు. ఇంతలోనే ఆది సినిమా వచ్చి సూపర్ హిట్ అయింది. అదే సమయంలో సింహాద్రి సినిమా కథను రాజమౌళి ముందుగా బాలకృష్ణకు వినిపించారు. బాలయ్య ఈ కథ రిజెక్ట్ చేయడంతో ఎన్టీఆర్ కు వెళ్ళింది.
అప్పుడు బాలయ్య బి.గోపాల్ దర్శకత్వంలో పలనాటి బ్రహ్మనాయుడు సినిమా చేశారు. సింహాద్రి సినిమా కు ముందు రాజమౌళి దర్శకత్వంలోనే ఎన్టీఆర్ – బాలయ్య కాంబినేషన్లో సినిమా చేయాలని రాఘవేంద్రరావు ఆలోచన చేశారు. అది తన ఆర్కే ఫిల్మ్ అసోసియేట్ బ్యానర్లోనే చేయాలని అనుకున్నారు. అయితే అది కార్యరూపం దాల్చలేదు. సింహాద్రి తర్వాత ఎన్టీఆర్ ఇమేజ్ పూర్తిగా మారిపోయింది. ఆ తర్వాత మరే దర్శకుడు కూడా వీరి కాంబినేషన్లో ఓ మల్టీ స్టారర్ ఆలోచన చేయలేదు. మరి ఇప్పటికి అయినా నందమూరి ఫ్యామిలీ హీరోల మల్టీస్టారర్ చేసే సాహసం ఓ దర్శకుడు అయినా చేస్తారేమో చూడాలి.