1950వ దశకంలో తెలుగు సినిమా రంగాన్ని ఏలేసిన ఎంతోమంది స్టార్ హీరోయిన్లు ఉన్నారు. వీరిలో అంజలీదేవి, మహానటి సావిత్రి, వరలక్ష్మి, శాంతకుమారి, లక్ష్మి ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది హీరోయిన్లు ఉన్నారు. వీరిలో అప్పట్లో నటనలో నటనకంటే కూడా జీవించేసేవారు. ఈ లిస్టులోనే మేటినటి కన్నాంబ కూడా ఉండేవారు. కన్నాంబ నటనలో జీవించేసేవారు.
కన్నాంబ అసలు పేరు పసుపులేటి కన్నాంబ. ఆమె 1912లో పశ్చిమగోదావరి జిల్లాలోని ఏలూరులో జన్మించారు. ఆమె గాయనిగా, హీరోయిన్‌గా రాణించారు. కన్నాంబ కెరీర్‌లో ఎన్నో బ్లాక్‌బస్టర్ సినిమాలు ఉన్నాయి. ఆమె పౌరాణిక పాత్రలతో పాటు జానపద పాత్రలు, సాంఘిక పాత్రల్లోనూ మెప్పించారు. పౌరాణిక, జానపద పాత్రలు చేయాలంటే కన్నాంబకు కొట్టిన పిండి.
కన్నాంబ చనిపోయాక ఆచారం ప్రకారం ఆమె మృతదేహాన్ని నగలతో పాటు పాతిపెట్టారు. అయితే దొంగలు ఆమె నగలతో పాటు మృతదేహాన్ని కూడా మాయం చేశారు. కన్నాంబ నటించిన గృహలక్ష్మి సినిమా షూటింగ్‌లో ఓ విచిత్ర సంఘటన జరిగింది. 1938లో ఈ సినిమా షూటింగ్ మద్రాస్‌లో జరిగింది. ఈ సినిమా క్లైమాక్స్ ప్రకారం కన్నాంబ పిచ్చిదైపోవాల్సి ఉంది.
సత్యం జయించదు.. దేవుడు లేడు అని చెపుతూ ఆమె వీథుల్లో తిరగాల్సి ఉంటుంది.. మద్రాస్ నగరంలోని జార్జ్‌టౌన్ వీథుల్లో ఈ సీన్ షూట్ చేస్తున్నారు. కన్నాంబ కార్లు, బండ్లు తోసుకుంటూ వెళుతూ పిచ్చిదానిలా ప్రవర్తిస్తూ ఉంటుంది. ఆమె నటన చూసిన జనాలు ఆమె నిజంగానే పిచ్చిదని అనుకున్నారు. ఆమె ఎక్కడ జట్కా బండి కింద పడుతుందో అని ఆమెను పట్టుకున్నారు.
ఆ తర్వాత అది షూటింగ్ అని.. కన్నాంబ పిచ్చిదాని పాత్రలో నటిస్తోందని తెలిసి మద్రాస్ ప్రజలు ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత ఆ సినిమా సూపర్ హిట్ అయ్యి.. కన్నాంబను స్టార్‌ను చేసింది.