జనసేనాని, పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ భీమ్లానాయక్ సినిమా విషయంలో ఏపీ ప్రభుత్వం అడుగడుగునా అడ్డుతగులుతోంది. తీవ్రమైన కక్ష సాధింపులకు పాల్పడుతోన్న పరిస్థితే ఉందన్నది తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రం గతంలో పుష్ప, సంక్రాంతికి నాగార్జున బంగార్రాజు సినిమాలకు లేని ఒత్తిళ్లు, నిబంధనలు తమ అభిమాన హీరో సినిమాకేనా ? అంటూ కారాలు మిరియాలు నూరుతున్నారు. మరోవైపు జగన్ సర్కార్ తీరును నిరసిస్తూ పవన్ అభిమానులు తిరుపతిలో రోడ్డెక్కారు.
ఏపీ ప్రభుత్వం మాత్రం థియేటర్లతో పాటు ఎగ్జిబిటర్లకు, రెవెన్యూ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఎక్కడా బెనిఫిట్ షోలు వేయకూడదు. తాము చెప్పిన రేట్లకే టిక్కెట్లు అమ్మాలి.. కాదూ కూడదని నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని, థియేటర్లు మూసివేయాల్సి వస్తుందని కూడా కఠిన ఆదేశాలు వచ్చేశాయి. దీంతో థియేటర్ల యజమానులు, ఎగ్జిబిటర్లు ఎక్కడికక్కడ భయపడిపోతున్నారు.
ఆగని పవన్ అభిమానులు..
ఏపీ ప్రభుత్వం బెనిఫిట్ షోలు, అదనపు షోలు ఎంత రద్దు చేసినా తమ అభిమాన హీరో సినిమా చూసే విషయంలో పవన్ అభిమానులు ఏ మాత్రం వెనక్కు తగ్గడం లేదు. ఎలాగైనా అర్ధరాత్రి షో లేదా తెల్లవారు ఝామున షో చూసేయాలని పొరుగు రాష్ట్రాలకు వెళ్లిపోతున్నారు. ఆంధ్రాలో పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన వారంతా దమ్మపేట బాలాజీ, అశ్వారావుపేట వెంకటేశ్వర, సాయిసుమన్ థియేటర్లలు తెల్లవారు ఝామున ఉదయం 4-5 గంటల షోలకు ముందే టిక్కెట్లు బుక్ చేసుకున్నారు.
సత్తుపల్లి, మధిర, కల్లూరు, పాల్వంచకు క్యూ..
కృష్ణా జిల్లాలోని తిరువూరు, మైలవరం నియోజకవర్గాలకు చెందిన వారంతా తెలంగాణలోని సత్తుపల్లి, మధిర, కల్లూరు, పాల్వంచలో సినిమా చూసేందుకు గత రాత్రి నుంచే వెళ్లిపోయారు. పశ్చిమగోదావరిలోని చింతలపూడి ప్రాంతానికి సత్తుపల్లితో అనుబంధం ఉండడంతో చాలా మంది సత్తుపల్లిలో సినిమా చూశారు.
విజయవాడ టు కోదాడ, హైదరాబాద్…
ఇక కృష్ణా జిల్లా జనాలతో పాటు విజయవాడకు చెందిన పవన్ అభిమానులు సినిమా అర్ధరాత్రి లేదా ఉదయమే చూడాలన్న ఆతృతతో తెలంగాణలోని కోదాడతో పాటు హైదరాబాద్‌కు వచ్చేశారు. జగ్గయ్యపేట, నందిగామ ప్రాంతాల వాళ్లు కోదాడలో టిక్కెట్లు బుక్ చేసుకోవడంతో కోదాడ కిక్కిరిసింది.
అనంతపురం టు బెంగళూరు…
అనంతపురం జిల్లాతో పాటు హిందూపురం, పుట్టపర్తి ప్రాంతాల వాళ్లు అంతా బెంగళూరులో తెల్లవారు ఝామున 3 గంటల నుంచే షోలు ఉండడంతో అక్కడకు వెళ్లిపోయారు. ఏదేమైనా ఏపీ ప్రభుత్వం ఎంత కట్టడి చేస్తున్నా పవన్ అభిమానులు మాత్రం ఎలాగైనా అర్ధరాత్రి లేదా ఉదయం ప్రీమియర్ షో చూడాలని ఇతర రాష్ట్రాలకు అయినా వెళుతున్నారే తప్పా ఎక్కడా తగ్గేదేలే అంటున్నారు. ఇక ఏపీలో మాత్రం ఉదయం 11 గంటల నుంచే షోలు ప్రారంభం కానున్నాయి.