ఎవరు ఔనన్నా.. ఎవరు కాదన్నా పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ భీమ్లానాయక్ సినిమాను ఏపీ సర్కార్ టార్గెట్ చేసింది. వైసీపీ వాళ్లు కూడా ఈ విషయం అంగీకరించాల్సిందే.. అంగీకరిస్తున్నారు కూడా..! జరుగుతున్న పరిణామాలు కళ్లముందు స్పష్టంగా కనిపిస్తున్నప్పుడు కాదు అనడానికి ఛాన్సే లేదు. అయితే ఏపీ ప్రభుత్వ పెద్దలు, మంత్రులు చెపుతోన్న మాట ఏంటంటే తమకు పవన్ సినిమాపై కక్ష లేదని.. అఖండ, పుష్ప సినిమాల విషయంలోనూ ఇలాగే వ్యవహరించామని.. తక్కువ రేట్లకు టిక్కెట్లు అమ్మామని అంటున్నారు. అయితే అది వాస్తవం కాదు.
అఖండకు ముందు ఇలాంటి ప్రచారమే జరిగింది.. అయితే బాలయ్య సినిమా విషయంలో మరీ అంత పట్టుదలకు పోలేదు. ఒకటి రెండు చోట్ల కాస్త హడావిడి చేసినా కొన్ని చోట్ల అర్ధరాత్రి నుంచి.. మరికొన్ని చోట్ల ఉదయం 5 గంటల నుంచే షోలు మొదలైపోయాయి. పుష్ప సినిమాను కూడా చూసీ చూడనట్టు వదిలేశారు. ఇక సంక్రాంతికి వచ్చిన నాగార్జున బంగార్రాజు సినిమాకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. అయినా కూడా ఆ సినిమా క్యాష్ చేసుకోలేదు. అది వేరే విషయం.
ఇక నాని ఏపీ ప్రభుత్వాన్ని ఘాటుగా టార్గెట్ చేయడంతో శ్యామ్‌సింగ రాయ సినిమాకు చుక్కలు చూపించేశారు. ఈ సినిమా ఆడుతోన్న థియేటర్ల దగ్గర ఆర్వోలు, ఎమ్మార్వోలు కాచుకుని ఉన్నారు. చాలా సాధారణ రేట్లకు టిక్కెట్లు అమ్మడంతో పాటు చాలా థియేటర్లపై దాడులు చేసి మూసివేయడం.. మరికొన్ని థియేటర్లను వాళ్లే స్వచ్ఛందంగా మూసివేయడంతో ఈ సినిమాకు ఏపీలో థియేటర్లు దొరకలేదు. ఇక డీజే టిల్లును కూడా వదిలేశారు.
ఇక ఇప్పుడు భీమ్లానాయక్ విషయంలో కలెక్టర్ల నుంచి స్పష్టమైన ఆదేశాలు రావడంతో ఆర్డీవోలు, ఎమ్మార్వోలు, వీఆర్వోలు ఇలా యంత్రాంగం అంతా థియేటర్ల దగ్గరే మోహరిస్తోన్న పరిస్థితి. చివరకు అధికారులకు రాజకీయ నాయకుల నుంచి పెద్ద ఎత్తున ఫోన్లు వెళుతుండడంతో వారు కూడా ప్రభుత్వం ఇలా చేయడం తమకు సంకటగా మారిందని.. అసలు తమకు, ఈ సినిమాలకు లింక్ పెట్టడం ఏంటని వారు కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వం రూల్స్ ఎలాగైనా పెట్టుకోవచ్చు.. సరే టిక్కెట్టు కూడా తనకు నచ్చినట్టు పెట్టుకుందే అనుకుందాం.. అదే రూల్ అందరు హీరోలకు, అన్ని సినిమాలకు వర్తింపజేయాలి కదా..! నాగార్జునకు ఓ రూల్.. పవన్‌కు మరో రూల్ ఎలా వర్తిస్తుందన్నదే అర్థం కావడం లేదు. చివరకు భీమ్లానాయక్ సినిమా ప్రదర్శిస్తోన్న ఎగ్జిబిటర్లకు ఫోన్లు చేసి మరీ ప్రభుత్వం చెప్పిన రేట్లకే టిక్కెట్లు అమ్మాలని ఒత్తిడి చేస్తున్నారంటే పరిస్థితి ఎలా ? ఉందో అర్థమవుతోంది.
ప్రభుత్వం తాము చేస్తోంది కరెక్టే అనుకుంటోన్నా కాని పల్లెల నుంచి పట్టణాల వరకు మాత్రం పవన్ కళ్యాణ్ సినిమాను కావాలనే తొక్కేస్తున్నారన్న టాక్ అయితే బాగా స్ప్రెడ్ అయిపోయింది. ఇది అంతిమంగా పవన్‌పై కావాల్సినంత సానుభూతి పెరగడంతో పాటు రేపటి వేళ ఎన్నికల్లో అధికార పార్టీకి ఇబ్బందిగా మారినా మారొచ్చు. మరి ఈ తప్పు జగన్‌కు తెలిసి జరుగుతుందా ? తెలియకుండా జరుగుతుందా ? అన్నది ప్రశ్న కాదు.. కానీ ఆన్సర్ మాత్రం నష్టం జగన్‌కే..!