భారత గాన కోకిల లతా మంగేష్కర్ ఈ రోజు మృతి చెందారు. కోవిడ్ సమస్యలకు తోడు అనేక అనారోగ్య సమస్యలతో వెంటిలేటర్‌పై ఉన్న ఆమె ఆదివారం ఉదయం ఈ లోకాన్ని వీడి వెళ్లారు. సంగీత ప్రియుల్లో చాలా మందికి తెలిసిన కథే అయినా ఇప్పుడు ఆమె మృతి తర్వాత మరోసారి ఆమె ప్రేమకథను గుర్తు చేసుకోవాల్సి ఉంది. ఆమెది ఓ విషాద ప్రేమకథ. లతా మంగేష్కర్ పెళ్లి చేసుకోలేదు.. వాస్తవానికి ఆమె ఎందుకు పెళ్లి చేసుకోలేదు.. ఆమె ప్రేమకథ ఏంటన్నదానిపై మాంచి సినిమాయే తీయవచ్చు.
మాజీ క్రికెటర్, బీసీసీఐను కొన్నాళ్ల క్రితం ఏకచక్రాధిపత్యంగా ఏలేసిన రాజ్‌సింగ్ దుంగాపూర్ గురించి ఈ తరం వాళ్లలో తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఆయన లా చదివేందుకు ముంబై వచ్చినప్పుడు లత బ్రదర్ ద్వారా లతకు పరిచయం కావడం.. తక్కువ టైంలోనే స్నేహితులు కావడం.. చివరకు పీకల్లోతు ప్రేమలో మునిగిపోయి పెళ్లి చేసుకుందాం అనే వరకు వెళ్లారు.
అప్పట్లో బాలీవుడ్ ఎలా ఉందంటే లత పాట పాడితేనే సినిమా ఉంటుంది.. సినిమా హిట్ అవుతుందని దర్శక, నిర్మాతలు హీరోలు బలంగా నమ్ముతున్న రోజులు. ఆ టైంలో రాజ్‌సింగ్ తన ప్రేమను తల్లిదండ్రులకు చెప్పారు. వాళ్లది రాజస్థాన్‌లోని ఓ సంస్థానం. ఈ విషయం తెలిసిన రాజ్‌సింగ్ తల్లిదండ్రులు నువ్వు సినిమాల్లో పాటలు పాడుకునే అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా ? అలాంటి పాటలు పాడుకునే అమ్మాయి మన ఇంటికి కోడలిగా రావడమా ? అని ఫైర్ అయ్యారు.
రాజ్‌సింగ్ ఎంత పెద్ద క్రికెటర్ అయినా కూడా తండ్రిని ఎదిరించి నిర్ణయం తీసుకోలేదు. లతకు ఇదే విషయం చెప్పాడు. నిన్ను పెళ్లి చేసుకోకపోతే నాకు అసలు జీవితంలో పెళ్లే వద్దని ప్రతిజ్ఞ చేశాడు. ఈ విషయం విని లత కన్నీరు మున్నీరు అయ్యింది. లత జీవితాంతం పెళ్లి చేసుకోలేదు. చివరకు అటు రాజ్‌సింగ్ సైతం పెళ్లి చేసుకోలేదు. ఇద్దరూ జీవితాంతం పెళ్లి చేసుకోకుండా మంచి స్నేహితులుగానే ఉన్నారు. రాజ్‌సింగ్ అల్జీమర్స్‌తో 2009లో చనిపోయాడు.