సౌత్ సినిమా పరిశ్రమ అనగానే మనకు టాలీవుడ్, కోలీవుడ్, మల్లూవుడ్ ,శాండల్‌వుడ్ సినిమా పరిశ్రమలు గుర్తుకు వస్తాయి. ఒకప్పుడు ఈ నాలుగు భాషలకు చెందిన సినిమాలు అన్నీ మద్రాస్‌లోని విజయ- వాహినీ, జెమినీ స్టూడియోస్‌లోనే షూటింగ్ జరుపుకునేవి. ఆ తర్వాత భాషా ప్రయుక్త రాష్ట్రాలేర్పడడంతో ఏ భాషలో సినిమాలు అక్కడే షూటింగ్ జరుపుకుంటూ వస్తున్నాయి. 1990వ దశకంలో తెలుగు సినిమా పరిశ్రమను మద్రాస్ నుంచి హైదరాబాద్‌కు తీసుకువచ్చారు. ఇండస్ట్రీ హైదరాబాద్‌కు వచ్చాక ఇక్కడ లక్షలాది మందికి ఉపాధి ఏర్పడింది. మరిన్ని సినిమాలు తెరకెక్కడంతో పాటు ఎక్కువ మంది టాలెంట్ దర్శకులు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు.
ఇక ఈ నాలుగు భాషలతో పాటు బాలీవుడ్‌లో రీమేక్ సినిమాల హవా ఇప్పుడు ఎక్కువుగా నడుస్తోంది. ప్రస్తుతం చిరంజీవి, పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోలు కూడా రీమేక్ సినిమాల్లోనే ఎక్కువుగా నటిస్తున్నారు. 1985లో పీటర్ వేర్ దర్శకత్వంలో హారిసన్ పోర్ట్ హీరోగా విట్‌నెస్ సినిమా రిలీజ్ అయ్యింది. అయితే మళయాళ దర్శకుడు ఫాజిల్ విట్‌నెస్ సినిమాను చూసి ఇండియన్ నేటివిటీకి అనుగుణంగా కథలో మార్పులు, చేర్పులు చేసి ముమ్ముట్టి – నదియా జంటగా పూవిన్ పుతియా పూన్ తెన్నల సినిమా తెరకెక్కించారు.
ఈ సినిమా హిట్ అవ్వడంతో తెలుగు రీమేక్ హక్కుల కోసం చాలా మంది పోటీపడ్డారు. చివరకు గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ ఈ సినిమా రీమేక్ రైట్స్ సొంతం చేసుకున్నారు. ఇది తెలియని విజయబాపినీడు విట్‌నెస్ సినిమా చూసి సాక్షి కథతో మరో లైన్ రాసుకున్నారు. ఆచంట గోపీనాథ్ నిర్మాతగా.. శ్రీదేవి – కృష్ణ జంటగా సినిమా ప్లాన్ చేసుకున్నారు. ఇందులో మహేష్‌బాబు బాలనటుడిగా నటించాలి.
త్వరలోనే షూటింగ్ ప్రారంభమవుతుందని అనుకుంటోన్న టైంలో ఇదే కథతో చిరంజీవి హీరోగా కోదండ రామిరెడ్డి దర్శకత్వంలో సినిమా చేస్తున్నారని తెలియడంతో కృష్ణ ఈ సినిమాను విరమించుకున్నారు. అలా పసివాడి ప్రాణం కృష్ణ మిస్ అయితే అదే చిరంజీవి చేసి సూపర్ హిట్ కొట్టారు.