గత యేడాదిన్నర కాలంగా కంటిన్యూగా సినిమాలు లేవు. కరోనా ఫస్ట్ వేవ్.. ఆ తర్వాత కరోనా సెకండ్ వేవ్ రావడంతో సినిమాలు ఆగిపోయాయి. ఇప్పుడు సినిమాలు రిలీజ్ అవుతున్నా కరోనా మూడో వేవ్ సందేహంతో ప్రేక్షకులు పూర్తిగా థియేటర్లకు రావడం లేదు. అటు ఏపీలో సెకండ్ షోలకు అనుమతులు లేవు.. టిక్కెట్ రేట్లు బాగా తగ్గిపోయాయి. ఈ భయాలతో టాలీవుడ్ నిర్మాతలు కూడా సినిమాలు రిలీజ్ చేసేందుకు ముందుకు రావడం లేదు. దీంతో గత ఆరేడు నెలలుగా వాయిదాలు పడ్డ పెద్ద సినిమాలు అన్నీ ఇప్పుడు వరుస పెట్టి థియేటర్లలోకి వస్తున్నాయి.
మార్చి, ఏప్రిల్, మే నెలల్లో టాలీవుడ్లో పెద్ద జూదం నడుస్తోంది. ఈ మూడు నెలల్లోనే వరుస పెట్టి పెద్ద సినిమాల రిలీజ్‌ను షెడ్యూల్ చేస్తున్నారు. ఈ మూడు నెలల్లో ప్రేక్షకులు టాలీవుడ్‌కు చెల్లించాల్సిన మొత్తం రు. 1500 కోట్లు. అంటే నెలకు సగటును రు. 500 కోట్లు ఇవ్వాలి. టాలీవుడ్ చరిత్రలో ఎప్పుడూ కూడా ఈ స్థాయి టార్గెట్ ప్రేక్షకులకు లేదు. ఇన్నీ కోట్ల గ్రాస్ వస్తేనే అప్పుడు పెద్ద సినిమాలు బ్రేక్ ఈవెన్ అవుతాయి.
ఇక లైన్లో ఉన్న పెద్ద సినిమాల్లో రాధేశ్యామ్ – భీమ్లా నాయక్ – ఆర్ఆర్ఆర్ – ఆచార్య – సర్కారు వారి పాటతో పాటు ఎఫ్ 3 – పక్కా కమర్షియల్ – రామారావు ఆన్ డ్యూటీ – గని – అంటే సుందరానికితో పాటు శర్వానంద్ నటించిన రెండు సినిమాలు, రవితేజ ఖిలాడీ సినిమాలు కాస్త ముందుగా లైన్లో ఉన్నాయి. ప్రతి పెద్ద సినిమాలకు రెండు తెలుగు రాష్ట్రాల్లో రు. 100 కోట్ల మార్కెట్లో విడుదలవుతోంది. త్రిబుల్ ఆర్ అయితే రు. 150 కోట్ల రేంజ్లో రిలీజ్ అవుతోంది.
అన్ని సినిమాల మార్కెట్ చూస్తేనే రు.750 కోట్లుగా ఉంది. ఇంత మాత్రం షేర్ రావాలంటే రు.1500 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టాలి. మన తెలుగు ప్రేక్షకులు నెలకు రు. 500 కోట్లు సినిమాల మీద ఖర్చు చేస్తారా ? అన్నది పెద్ద డౌటే..! గత కొన్నేళ్లలో ఎప్పుడు ఇంత పెద్ద బెట్, టార్గెట్ మన ఇండస్ట్రీకి లేదు. ఈ పెద్ద సినిమాల్లో ఏ మాత్రం తేడా కొట్టినా కూడా చాలా మంది బయ్యర్ల కొంప కొల్లేరు అవుతుంది. మరి మన ప్రేక్షకుల దేవుళ్లు ఏం చేస్తారో ?