కలెక్షన్‌కింగ్ మోహన్‌బాబు పదే పదే అన్నగారు అని సీనియర్ ఎన్టీఆర్ గురించి చెపుతూ ఉంటారు. ఆ మాటకు వస్తే తన గురువు దాసరి అని.. తన అన్న గారు ఎన్టీఆర్ అని పదే పదే చెప్పే మోహన్‌బాబు అదే ఎన్టీఆర్‌ను ముఖ్యమంత్రి పదవి నుంచి కిందకు దింపేస్తే కనీసం ఆయన వైపు కూడా నిలబడలేదు.. అదేమని అడిగితే అప్పుడేవో జరిగాయి.. దానికి చాలా కారణాలు ఉన్నాయంటాడు. సరే ఇది పక్కన పెడితే ఎన్టీఆర్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేసిన సినిమా మేజర్ చంద్రకాంత్. ఆ సినిమా తెలుగు గడ్డపై ఎలాంటి సంచలనాలు నమోదు చేసిందో చెప్పక్కర్లేదు.
లక్ష్మీప్రసన్న పిక్చర్స్ బ్యానర్‌పై మోహన్‌బాబు స్వయంగా నిర్మించిన ఈ సినిమాకు కె. రాఘవేంద్రరావు దర్శకుడు. సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యి తెలుగు ప్రజలను ఓ ఊపు ఊపేసింది. ఈ సినిమా 1994 ఎన్నికల్లో ఎన్టీఆర్ అప్రతిహత విజయం సాధించి తిరిగి ముఖ్యమంత్రి అయ్యేందుకు దోహదమైంది. ఈ సినిమాకు ముందు మోహన్‌బాబు వరుస ప్లాపులతో ఉన్నాడు. ఇంకా చెప్పాలంటే మోహన్‌బాబు మార్కెట్ పూర్తిగా పడిపోయింది. వరుస ప్లాపులు.. దీనికి తోడు ఎక్కువుగా సొంత బ్యానర్లే కావడంతో ఆర్థికంగా కూడా నష్టపోయాడు.
అలాంటి టైంలో ఈ సినిమాలో ఎన్టీఆర్ నటిస్తే బాగుంటుందన్న అభిప్రాయానికి వచ్చాక మోహన్‌బాబు వెళ్లి ఎన్టీఆర్‌ను కలవడం.. ఎన్టీఆర్ ఏ మాత్రం ఆలోచించకుండా షూటింగ్ ఎప్పుడు ? బ్రదర్ అనడం చకచకా జరిగిపోయాయి. ఆ తర్వాత ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఎన్టీఆర్ షూటింగ్‌కు ముందు రెమ్యునరేషన్ తీసుకోలేదు. ఎన్టీఆర్‌ను డేట్లు అడిగేటప్పుడు మోహన్‌బాబు రు. 25 లక్షలు తీసుకువెళ్లి ఎన్టీఆర్‌కు ఇవ్వబోయారట. ఎన్టీఆర్ మాత్రం ముందు సినిమా హిట్ అవ్వాలని.. ఆశీర్వదించడంతో పాటు హిట్ అయ్యాకే రెమ్యునరేషన్ అని చెప్పారట.సినిమా సూపర్ హిట్ అవ్వడంతో పాటు మోహన్‌బాబుకు పిచ్చపిచ్చగా లాభాలు తెచ్చిపెట్టింది.
ఇక తిరుపతి వేదికగా మోహన్‌బాబు ఈ సినిమా 100 రోజుల ఫంక్షన్ ఘనంగా నిర్వహించారు. ఈ వేదికపైనే అన్నగారు ఎన్టీఆర్ లక్ష్మీపార్వతిని వివాహం చేసుకోవడం పెద్ద సంచలనానికి దారితీసింది. ఇక సినిమా వేదిక మీద కూడా మోహన్‌బాబు తనకు రెమ్యునరేషన్ ఇవ్వబోతే తాను తీసుకోలేదని ఎన్టీఆర్ చెప్పారు. అయితే ఇప్పుడు పెళ్లవ్వడంతో కొత్త సంసారంలోకి అడుగుపెడుతున్నాను.. ఖర్చులు కూడా పెరుగుతాయి.. అందుకే రెమ్యునరేషన్ తీసుకోవాలని అనుకుంటున్నాను.. అది కూడా మోహన్‌బాబు ఇష్టపడితేనే అన్నారు.. ఆ వెంటనే మోహన్‌బాబు ఓకే అన్నట్టుగా తలూపారు.
వెంటనే మోహన్‌బాబు ఓ ఖాళీ చెక్కును ఎన్టీఆర్ చేతిలో పెట్టారు. ఆ తర్వాత ఎన్టీఆర్ మోహన్‌బాబు అనుకున్నదానికంటే కాస్త ఎక్కువే రాసుకున్నారట. అయితే మోహన్‌బాబుకు భారీ లాభాలు రావడంతో పాటు మోహన్‌బాబు కెరీర్‌కు మేజర్ చంద్రకాంత్ పునర్జన్మ లాంటిది. మోహన్‌బాబు సినిమా స్టార్టింగ్ ముందుగానే రు. 25 లక్షలు ఇవ్వాలని అనుకున్నారు.. ఎన్టీఆర్ మహా రాసుకుంటే రు. 50 లక్షలు రాసుకుంటారని అనుకున్నారు.
అయితే అప్పటికే చిరంజీవి లాంటి హీరో కోటి రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు. మరి ఈ లెక్కన చూసుకున్నా… అప్పటికే సీఎంగా చేసిన ఎన్టీఆర్ ఇమేజ్‌కు తోడు ఆ సినిమా సాధించిన విజయం చూసుకున్నా ఎన్టీఆర్‌కు ఇంకా ఎక్కువ రెమ్యునరేషనే ఇవ్వాలి. ఏదేమైనా ఎన్టీఆర్ తాను అనుకున్న దానికంటే కాస్త ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకున్నందుకే మోహన్‌బాబు హర్ట్ అయిపోయారన్న టాక్ ఉంది.
అందుకే ఆ తర్వాత ఎన్టీఆర్‌తో మోహన్‌బాబు మాట్లాడలేదన్న గుసగుసలు కూడా ఉన్నాయి. చివరకు ఎన్టీఆర్ చనిపోయే ముందు ఆయన్ను పదవి నుంచి దింపేసినప్పుడు రాజ్యసభ సభ్యుడిగా కూడా ఉన్న మోహన్‌బాబు ఎన్టీఆర్ దగ్గర లేరు. ఈ విషయాన్ని ఆయనే ఎన్నోసార్లు ఒప్పుకున్నారు. తాను తప్పు చేశానని మదనపడ్డారు. ఎన్టీఆర్ చనిపోయినప్పుడు మాత్రమే వెళ్లారు. ఆ తర్వాత చంద్రబాబుకు దగ్గరైన మోహన్‌బాబు కొద్ది రోజులకే ఆయనతోనూ విబేధించి మళ్లీ టీడీపీకి దూరమైన పరిస్థితి.