టాలీవుడ్ లో ఎంతోమంది దర్శకులు ఉన్నా దర్శకుడు తేజది ఎప్పుడు విభిన్నమైన శైలీ. ఉషాకిరణ్ మూవీస్ బ్యానర్ లో 2000 సంవత్సరంలో వచ్చిన చిత్రం సినిమాతో అప్పటివరకూ కెమెరామెన్ గా ఉన్న తేజ మెగాఫోన్ పట్టాడు. తొలి సినిమాతోనే సూపర్ హిట్ కొట్టిన తేజకు ఆ తర్వాత నువ్వు నేను – జయం లాంటి సూపర్ హిట్ సినిమాలు వరుసగా వచ్చాయి. దీంతో తేజ గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. మెగాస్టార్ చిరంజీవితో కూడా తేజ సినిమా పట్టాలు ఎక్కబోతోందంటూ 2002 టైంలో బాగా ప్రచారం జరిగింది. ఆ తర్వాత వరుసగా ఎన్నో ప్లాప్ సినిమాలు తీసిన తేజ… మారుతున్న ట్రెండ్‌కు అనుగుణంగా తన కథలను ప్రేక్షకులకు కనెక్ట్ చేయలేకపోయారు.
చాలా లాంగ్ గ్యాప్ తర్వాత నేనే రాజు నేనే మంత్రి సినిమా ఎట్టకేలకు లైన్‌లోకి వచ్చారు. ఇప్పుడు దగ్గుబాటి సురేష్ బాబు రెండో తనయుడు అభిరామ్ లాంచింగ్ మూవీ అహింస సినిమాతో పాటు నల్లమలపు శ్రీనివాస్ నిర్మాతగా తెరకెక్కే సినిమాకు కూడా తేజ దర్శకత్వం వహిస్తున్నారు. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వద్ద అసిస్టెంట్‌గా పనిచేసిన తేజ కెమెరామెన్ గా పనిచేసి ఆ తర్వాత చిత్రం సినిమాతో మెగాఫోన్ పట్టుకుని దర్శకుడు అయ్యారు.
తేజ ఐ డ్రీమ్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను కమలహాసన్ – రజినీకాంత్ – మహేష్ బాబుతో పాటు నటసింహం బాలకృష్ణ లాంటి వాళ్ళతో సినిమాలు చేస్తానని… వాళ్ళతో సినిమాలు చేయడం తనకు చాలా ఈజీ అని చెప్పారు. అయితే మెగాస్టార్ చిరంజీవితో పాటు ఎన్టీఆర్ లాంటి హీరోలను డీల్ చేయలేనని… వాళ్లంతా ఒక డైలో ఉంటారని సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో తేజ మెగాస్టార్ చిరంజీవి అంటే తనకు ఎంతో అభిమానం అని చెప్పడంతో పాటు చిరంజీవితో సినిమా చేసేందుకు ఆసక్తి కూడా చూపించారు. అయితే మధ్యలో వీరికి ఎక్కడో తేడా కొట్టడంతో పాటు వరస ఫ్లాపుల్లో ఉన్నప్పుడు తనను పట్టించుకోకపోవడంతో చిరంజీవిని తేజ పరోక్షంగా ఇలా టార్గెట్ చేశారని ఇండస్ట్రీలో ప్రచారం నడిచింది.
చిరంజీవితో తాను సినిమా చేయలేనన్న తేజ బాలకృష్ణతో మాత్రం సినిమా చేసేందుకు ఆసక్తి గా ఉన్నానని… ఆయనను డీల్ చేయడం చాలా సులువు అని చెప్పటం విశేషం. ఇక కరోనా టైంలో ఇండస్ట్రీలో సమస్యలపై సినిమా పెద్దల చిరంజీవి ఆధ్వర్యంలో పెట్టుకున్న మీటింగ్ కు కూడా బాలకృష్ణను పిలవకపోవడం తప్పేనని కూడా బాలయ్యకు సపోర్ట్ గా మాట్లాడారు. ఇక దగ్గుబాటి అభిరామ్ అహింస సినిమా హిట్ అయితే తేజ కు మంచి పేరు రావడంతో పాటు వాటికి అభిరామ్‌కు కూడా గ్రాండ్ లాంచింగ్ దొరికినట్టు అవుతుంది.