సమరసింహారెడ్డి.. తెలుగు సినిమా చరిత్రను తిరగరాసిన సినిమా. అప్పటి వరకు ఓ మూసలో వెళుతోన్న తెలుగు సినిమా యాక్షన్‌కు సరికొత్త ఇమేజ్ తెచ్చిపెట్టిన ఘనత ఈ సినిమాదే. దర్శకధీరుడు రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ అందించిన స్టోరీ, పరుచూరి బ్రదర్స్ పదునైన డైలాగులు, బి.గోపాల్ డైరెక్షన్.. అన్నింటికి మించి నటసింహం నందమూరి బాలకృష్ణ విరోచిత నటన ఈ సినిమాను చరిత్రలో ఎప్పటకీ మర్చిపోలేని సినిమాను చేసేశాయి.
1999 సంక్రాంతి కానుకగా మెగాస్టార్ చిరంజీవి స్నేహంకోసం, బాలయ్య సమరసింహారెడ్డి రెండూ బాక్సాఫీస్ దగ్గర పోటీ పడ్డాయి. సమరసింహారెడ్డి జోరు ముందు స్నేహం కోసం యావరేజ్‌గా ఆడింది. సమరసింహారెడ్డి ఆ రోజుల్లోనే 77 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. అప్పట్లో అన్ని కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకున్న తొలి సినిమాగా ఈ సినిమా రికార్డులకు ఎక్కింది. ఈ సినిమాలో ముందుగా సిమ్రాన్ పాత్రకు రాశీని అనుకున్నారు.
అయితే రాశీ సీతాకోకచిలుకు సీన్లో నటించేందుకు ఒప్పుకోలేదు. దీంతో ఆ ప్లేస్‌లో సిమ్రాన్‌ను తీసుకున్నారు. ఇక ముందుగా సమరసింహం అన్న టైటిల్ అనుకున్నా.. తర్వాత పరుచూరి సూచనతో సమరసింహారెడ్డి అన్న టైటిల్ పెట్టారు. రజతోత్సవాలు, 200 రోజుల సెంటర్లలో కూడా సమరసింహారెడ్డి సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. ఈ క్రమంలోనే కర్నూలు జిల్లా నంద్యాలలో ఈ సినిమా ఓ అరుదైన రికార్డ్ క్రియేట్ చేసింది.
నంద్యాల నేషనల్ థియేటర్లో కంటిన్యూగా 325 రోజులు ఆడిన ఈ సినిమా ఆల్ టైం డిస్టిక్ రికార్డు క్రియేట్ చేసింది. ఈ థియేటర్లో ఈ సినిమా అన్ని రోజులు ఆడడం గొప్ప విషయమే. సిట్టింగ్ కెపాసిటీ 1100 మంది.. కుర్చీలు 980 ఉండేవి. ఇంత పెద్ద థియేటర్లో కంటిన్యూగా 325 రోజులు అంటే ఆ రోజుల్లో కథలు కథలుగా చర్చించుకున్నారు. తర్వాత ఇదే కర్నూలు జిల్లాలోని ఎమ్మిగనూరులో బాలయ్య లెజెండ్ 400 రోజులు ఆడింది.