టాలీవుడ్ పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్‌కు ఎలాంటి క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అక్కడ అమ్మాయి.. ఇక్కడ అబ్బాయి సినిమాతో స్టార్ట్ అయిన పవన్ కళ్యాణ్ ప్రస్థానం ఇంతింతై ఈ రోజు పవన్‌ను టాలీవుడ్ పవర్ స్టార్‌గా మార్చేసింది. తాజాగా పవన్ భీమ్లానాయక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. మళయాలంలో హిట్ అయిన అయ్యప్పనం కోషియమ్ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కిన ఈ సినిమా రేపు ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
దగ్గుబాటి రానా మరో హీరోగా నటించిన నాయక్‌లో పవన్ సరసన నిత్యామీనన్, రానా సరసన సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటించారు. థమన్ స్వరాలు అందించగా సితార ఎంటర్టైన్‌మెంట్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. సాగర్ కె. చంద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమాకు త్రివిక్రమ్ సంభాషణలు సమకూర్చారు. ఈ సినిమా ప్రి రిలీజ్ ఫంక్షన్ బుధవారం హైదరాబాద్ యూసఫ్‌గూడలోని పోలీస్ గ్రౌండ్స్‌లో జరిగింది.
ఈ ఫంక్షన్‌కు ముఖ్య అతిథులుగా తెలంగాణ మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్‌ను అప్యాయంగా భయ్యా అని సంబోధించారు. భీమ్లానాయక్ సినిమా హిట్ అవ్వాలని తాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అని ఆకాంక్షించారు. అలాగే మనమందరం కాలేజ్ చదివేటప్పుడు 23 – 26 ఏళ్ల క్రితం కాలేజ్ ఎగ్గొట్టి మరీ తొలిప్రేమ సినిమా చూశాం అని చెప్పారు. తాను కూడా ఆ సినిమా అలాగే చూశానన్నట్టుగా కేటీఆర్ చెప్పారు.
ఇక దర్శకుడు సాగర్ కె. చంద్ర మాట్లాడుతూ తాను పవన్ కళ్యాణ్ పంజా సినిమా ఆడియో ఫంక్షన్ కోసం పాస్ తీసుకుని కూడా లోపలకు వెళ్లలేకపోయానని.. రెండు, మూడుసార్లు లోపలకు వెళ్లకుండా ఎత్తిపడేశారని.. అలాంటిది తాను ఆ తర్వాత డైరెక్టర్ అయ్యి.. అదే పవన్ సినిమాను డైరెక్ట్ చేస్తానని అనుకోలేదని సంతోషం వ్యక్తం చేశాడు. ఇక ఈ సినిమాలో నటించిన మరో హీరో రానా మాట్లాడుతూ అదే పంజా ఫంక్షన్‌కు తాను కూడా వచ్చానని.. ట్రాఫిక్‌లో రెండు గంటల పాటు చిక్కుకుని వెనక్కు వచ్చేసానని చెప్పాడు.