ఎన్టీఆర్ స్టార్ హీరోగా ఉన్న టైంలోనే రాజకీయాల్లోకి వచ్చి సీఎం అయ్యారు. ఆయన సీఎం అయ్యాక కూడా సినిమా వాళ్లకు, సినిమా రంగానికి ఎప్పుడూ ప్రాధాన్యత ఇచ్చేవారు. అంతే కాదు 1989 ఎన్నికల్లో ఓడిపోయాక కూడా ఆయన సినిమాలు చేశారు. ఎన్టీఆర్ కెరీర్‌లో చివరి బ్లాక్‌బస్టర్ మేజర్ చంద్రకాంత్ సినిమా ఆయన ప్రతిపక్షంలో ఉండగా వచ్చిందే. ఇక ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్లాబ్ సిస్టమ్ తీసుకువచ్చారు.
అప్పట్లో ఎన్టీఆర్‌కు రాష్ట్రం మొత్తం మీద ఆరో ఏడో సినిమా హాళ్లు ఉండేవి. అందులో హైదరాబాద్‌లోనే మూడు, విజయవాడలో రెండు, తెనాలిలో ఒక హాట్ ఉండేవట. అలాగే మరో రెండు, మూడు థియేటర్లలో ఆయనకు భాగస్వామ్యం కూడా ఉండేది. అప్పట్లో ఒకే టిక్కెట్ మీద పదిమందిని లోపలకు పంపి.. థియేటర్లలో వంద మంది ఉంటే.. పది టిక్కెట్లే తెంపి.. వాటికే ట్యాక్స్ కట్టేవారు.
ఈ విషయం తెలిసిన సీఎం ఎన్టీఆర్ స్లాబ్ సిస్టమ్ పెట్టడమే కాక టిక్కెట్ల రేట్లు తగ్గించమని ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఇండస్ట్రీలో వాళ్లంతా ఆయన దగ్గరకు వెళ్లారు. ఈ ప్రతినిధి బృందంలో ఉన్న దాసరి నారాయణరావు ఎన్టీఆర్‌కు సమస్య వివరించారు. ఎగ్జిబిటర్లు స్లాబ్ సిస్టమ్‌తో బావురు మంటున్నారని చెప్పారు. వెంటనే ఎన్టీఆర్ దాసరి గారు నాకు ఆరేడు సినిమా థియేటర్లు ఉన్నాయి.. నాకంటే పెద్ద ఎగ్జిబిటర్ ఎవరైనా ఉండి.. అతడు బాధపడుతుంటే నా దగ్గరకు పంపండి అని చెప్పారట.
ఇక ఎన్టీఆర్‌కు సన్నిహితంగా ఉండే వ్యక్తికి అప్పట్లో విజయవాడలో రెండు థియేటర్లు ఉండేవట. ఆయన పక్క థియేటర్లతో పోలిస్తే టిక్కెట్ రేట్లు కాస్త పెంచి వసూలు చేస్తున్నారు. ఈ విషయం తెలిసిన ఎన్టీఆర్ ఆయన్ను పిలిపించుకుని టిక్కెట్ రేట్లు తగ్గించమని మరీ వార్నింగ్ ఇచ్చారట. ఇక ఈ స్లాబ్ సిస్టమ్ వైఎస్. రాజశేఖర్ రెడ్డి సీఎం అయ్యాక ఎత్తేశారు. అలాగే టిక్కెట్ రేట్లు తగ్గిస్తూ జీవో ఇచ్చారు.