టాలీవుడ్ బాక్సాఫీస్ వేదికగా మరో కొత్త యుద్ధానికి తెరలేచింది. కరోనా దెబ్బతో పెద్ద సినిమాల రిలీజ్ డేట్లు వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తున్నాయి. సంక్రాంతికి రావాల్సిన త్రిబుల్ ఆర్, రాధేశ్యామ్ రెండూ వాయిదా పడ్డాయి. ఈ రెండు సినిమాలు వాయిదా పడడంతో మెగాస్టార్ ఆచార్య సినిమా కూడా వాయిదా వేశారు. పవన్ కళ్యాణ్ భీమ్లానాయక్ లాంటి సినిమాల పరిస్థితి కూడా గందరగోళంగానే ఉంది. ఇక ముందుగా సంక్రాంతికే అనుకున్న విక్టరీ వెంకటేష్ – వరుణ్ తేజ్ ఎఫ్ 3, మహేష్‌బాబు సర్కారు వారిపాట పరిస్థితి కూడా డైలమాలోనే ఉంది.
తాజాగా త్రిబుల్ ఆర్ టీం, ఆచార్య టీం మీటింగ్ పెట్టుకుని ఈ రెండు సినిమాల రిలీజ్ డేట్ల విషయంలో క్లారిటీ ఇచ్చారు. త్రిబుల్ ఆర్ రిలీజ్‌కు ముందుగా రెండు డేట్లు అనుకున్నారు. ఆ రెండు కాకుండా ఇప్పుడు మార్చి 25న ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్టు క్లారిటీ ఇచ్చారు. దీంతో త్రిబుల్ ఆర్ కోసం కళ్లుకాయలు కాచేలా వెయిట్ చేస్తోన్న అభిమానులకు ఇదో పెద్ద రిలీఫ్ లాగా ఉంది.
అయితే ఆచార్య డేట్ కూడా మారింది. ఆచార్యను ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 29కు మార్చారు. ఈ డేట్ కూడా అఫీషియల్‌గా వచ్చేసింది. అయితే ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద ఆచార్య మరో పెద్ద సినిమాతో పోటీ ఎదుర్కోవాల్సి ఉంది. ఎఫ్ 3 సినిమాను ఏప్రిల్ 28న వేస్తున్నారు. అంటే బాక్సాఫీస్ దగ్గర మెగాస్టార్ చిరంజీవి – రామ్‌చరణ్ వర్సెస్ విక్టరీ వెంకటేష్ – మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మధ్య అదిరిపోయే ఫైట్ నడవనుంది.
ఈ రెండు సినిమాలు ఒక రోజు తేడాలో రిలీజ్ అవుతున్నాయి. మరి ఈ రెండు సినిమాల్లో ఏది పై చేయి సాధిస్తుందన్నదే ఉత్కంఠగా ఉంది. ఇక ఎఫ్ 2కు డబుల్ ఫన్ జోడించి ఈ సినిమాను అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో వెంకీ రేచీకటి బాధితుడిగా, వరుణ్ తేజ్ నత్తి మాట్లాడే యువకుడిగా కనిపిస్తున్నారు.