పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ భీమ్లానాయక్ ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ అభిమానులు దాదాపు యేడాది కాలంగా ఎంతో ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. సినిమాకు మంచి టాక్ వచ్చింది. ఇక ముందు నుంచి ఏపీ ప్రభుత్వం వర్సెస్ పవన్ కళ్యాణ్ మధ్య నడుస్తోన్న గ్యాప్ నేపథ్యంతో పాటు ఏపీలో ముందు నుంచి టిక్కెట్ రేట్ల విషయంలో కూడా ప్రభుత్వానికి, టాలీవుడ్‌కు మధ్య చర్చలు నడుస్తున్నాయి.
ఈ రోజు పవన్ అభిమానులు ఏపీలో కొన్ని చోట్ల వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. తిరుపతిలో నిన్న మోకాళ్ల మీద కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. ఇక పలు చోట్ల అభిమానులు సినిమా ప్రదర్శనకు అడ్డంకులు ఎదురవుతున్నాయని ఆరోపిస్తున్నారు. గుంటూరు జిల్లా మాచర్లకు చెందిన పవన్ ఫ్యాన్స్ చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
మాచర్లలో సినిమా ఆడుతోన్న థియేటర్ ముందు ఓ హుండీ ఏర్పాటు చేసి దానికి భీమ్లానాయక్ పోస్టర్ ఏర్పాటు చేశారు. టిక్కెట్ రేట్ల తగ్గింపు, వీఆర్వోల తనిఖీల నేపథ్యంలో డిస్ట్రిబ్యూటర్లను కాపాడేందుకు విరాళం ఇవ్వాలని కోరుతున్నారు. ఇక అదే గుంటూరు జిల్లా వేమూరు నియోజకవర్గం కొల్లూరులో భీమ్లానాయక్ సినిమా ప్రదర్శిస్తోన్న థియేటర్‌కు బీ ఫామ్ లేదని షోలు రద్దు చేశారు. దీంతో అభిమానులు బస్టాండ్ సెంటర్లో బైటాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. వీరు స్థానిక ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు.
ఇక కృష్ణా జిల్లాలో మైలవరంలో అయితే గతంలో సినిమాలకు టిక్కెట్ రేట్లు పెంచి అమ్మారని.. ఇప్పుడు ఈ తగ్గించిన టిక్కెట్ రేట్లకు అమ్మితే తమకు నష్టం తప్పా లాభం ఉండదని అక్కడ షోలను ఆపేశారు. కొన్ని చోట్ల షో ప్రదర్శిస్తోన్న చోట్ల ఎమ్మార్వోలు, వీఆర్వోలు థియేటర్ల దగ్గరుండి మరీ టిక్కెట్లు అమ్ముతున్నారు. కొన్ని చోట్ల పోలీసు బలగాలు రంగంలోకి దిగి థియేటర్ల దగ్గర కాపలా కాస్తున్నాయి. ఏదేమైనా భీమ్లానాయక్ దెబ్బతో ఏపీలో పలు చిత్ర విచిత్ర సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి.