1990వ దశకంలో తెలుగు సినిమా రంగంలో అగ్ర హీరోలుగా చిరంజీవి – బాలకృష్ణ – నాగార్జున – వెంకటేష్ సినిమాలు చేసేవారు. ఈ స్టార్ హీరోల సినిమాలు వస్తున్నాయంటే బాక్సాఫీస్ దగ్గర పెద్ద పండగ వాతావరణం ఉండేది. 1990వ దశకాన్ని యువరత్న నందమూరి బాలకృష్ణ లారీ డ్రైవర్ లాంటి సూపర్ హిట్ సినిమాతో ప్రారంభించారు. ఆ తర్వాత బాలయ్య రౌడీ ఇన్‌స్పెక్టర్ బంగారు బుల్లోడు లాంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించారు.
బాలయ్య – నాగార్జున – వెంకటేష్ కెరీర్ లో 1990 దశకంలోనే బుల్లోడు అన్న టైటిల్ తో సినిమాలు వచ్చాయి. బాలయ్య బంగారు బుల్లోడు – నాగార్జున ఘరానా బుల్లోడు – వెంకటేష్ సరదా బుల్లోడు సినిమాలు చేశారు. ఈ మూడు సినిమాలు ఫలితాలు పరిశీలిస్తే ఆసక్తికరంగా ఉంటాయి. సీనియర్ హీరో జగపతిబాబు తండ్రి వి.బి.రాజేంద్ర ప్రసాద్ నిర్మాతగా రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో బంగారు బుల్లోడు సినిమా వచ్చింది. ఈ సినిమాలో బాలకృష్ణ, రమ్యకృష్ణ, అప్పటి బాలీవుడ్ టాప్ హీరోయిన్ రవీనా టాండన్ నటించారు.
ఈ సినిమాతో పాటు అదే రోజు బాలయ్య – విజయశాంతి నటించిన నిప్పురవ్వు సినిమా రిలీజ్ అయింది. బాక్సాఫీస్ దగ్గర నిప్పురవ్వ ప్లాప్ అవ్వగా బంగారు బుల్లోడు సూపర్ హిట్ అయ్యింది. నిప్పురవ్వ సినిమా అంతకు ముందు రెండు సంవత్సరాల నుంచి షూటింగ్ జరుపుకుంటూ లేట్‌గా విడుదల అయ్యింది. ఇక 1990వ దశకంలోనే కిల్లర్ – ప్రెసిడెంట్ గారి పెళ్ళాం – వారసుడు లాంటి హిట్ సినిమాలతో ఫామ్‌లో ఉన్న నాగార్జున 1995లో కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఘరానా బుల్లోడు సినిమా చేశారు. ఈ సినిమాలో నాగార్జున – రమ్యకృష్ణ హీరోహీరోయిన్లుగా నటించారు. కీరవాణి అందించిన సంగీతం కూడా ఈ సినిమా హిట్ అవడానికి ఒక కారణంగా నిలిచింది.
ఇక 1990వ దశాబ్దంని బొబ్బిలి రాజా లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తో వెంకటేష్ ప్రారంభించారు. చంటి – కొండపల్లి రాజా లాంటి హిట్ సినిమాలతో జోరులో ఉన్న వెంకటేష్ సరదా బుల్లోడు సినిమా చేశారు. 1996 లో విజయలక్ష్మి ఆర్ట్స్ మూవీస్ నిర్మించిన ఈ సినిమాకు రవిరాజా పినిశెట్టి దర్శకత్వం వహించారు. వెంకటేష్ – నగ్మా హీరో, హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా అత్తా అల్లుళ్ళ సవాల్ తో తెరకెక్కింది. అలనాటి మేటి నటి మంజుల అత్తగా నటించారు. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ప్లాప్‌గా నిలిచింది. ఈ ముగ్గురు స్టార్ హీరోలు బుల్లోడు అనే టైటిల్ కలిసి వచ్చేలా చేసిన ఈ మూడు సినిమాలలో బంగారు బుల్లోడు సూపర్ హిట్ అయితే… నాగార్జున ఘరానా బుల్లోడు హిట్ అయింది. వెంకటేష్ సరదా బుల్లోడు మాత్రం ప్లాప్‌గా నిలిచింది.