పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లానాయక్ థియేటర్లలోకి వచ్చేందుకు మరి కొద్ది గంటల టైం మాత్రమే ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు సినీ అభిమానులు, మరోవైపు పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ రోజు అర్ధరాత్రి నుంచే ప్రీమియర్ల ద్వారా ఈ సినిమాను ఎంజాయ్ చేసేందుకు రెడీ అవుతున్నారు. పవన్ కళ్యాణ్ నుంచి అజ్ఞాతవాసి తర్వాత అభిమానుల ఆకలి తీర్చేసే సినిమా రాలేదు. అజ్ఞాతవాసి ప్లాప్ తర్వాత గతేడాది వచ్చిన వకీల్‌సాబ్ హిట్ అయినా.. వసూళ్ల పరంగా పవన్ రేంజ్ సినిమాకు కాదు.. పైగా అది కమర్షియల్ ఎలిమెంట్స్ కన్నా సోషల్ మెసేజ్‌తో తెరకెక్కింది.
ఇక ఇప్పుడు భీమ్లానాయక్ సినిమాతో పవన్ తన అభిమానుల ఆకలి మొత్తం తీర్చేస్తాడనే ఆశలు ఉన్నాయి. ఈ సినిమా ఇప్పటికే మల్లూవుడ్‌లో అయ్యప్పన్ కోషియమ్‌గా తెరకెక్కి హిట్ అవ్వడం ఒక ఎత్తు అయితే.. రానా మరో హీరోగా నటించడం.. టాలెంటెడ్ హీరోయిన్లు నిత్యమీనన్, సంయుక్త మీనన్ ఉండడం.. థమన్ సంగీతం.. పైగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సంభాషణలు ఇవన్నీ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాయి.
పైగా ఇటు నిన్న జరిగిన ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు తెలంగాణ మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో పాటు ఇద్దరు ఎమ్మెల్యే దానం నాగేందర్, మాగంటి గోపీనాథ్ కూడా హాజరయ్యారు. పైగా రెండు వారాల పాటు ఐదో షోకు అనుమతులు ఇచ్చింది. ఇక ఇప్పటికే టిక్కెట్ రేట్లు కావాల్సిన కాడకు పెంచుకున్నారు. ఎటూ చూసినా తెలంగాణ ప్రభుత్వం భీమ్లానాయక్‌ను ఎలా ప్రమోట్ చేస్తుందో చెప్పేందుకు ఇవే పెద్ద ఉదాహరణలు. పైగా ఐదో షో అనుమతి ఇస్తూ అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్సీలకు ఆదేశాలు కూడా జారీ చేసింది.
ఏపీలో పూర్తిగా రివర్స్…
తెలంగాణలో భీమ్లానాయక్‌ను ప్రభుత్వంమే ఓ రేంజ్‌లో ప్రమోట్ చేస్తుందా ? అన్న వాతావరణం ఉంటే ఇటు ఏపీలో అందుకు సీన్ రివర్స్‌లో ఉంది. టిక్కెట్ ధరల పెంపుపై ఇప్పటకీ జీవో రాలేదు. పాత రేట్లకే అమ్మాలని ప్రభుత్వం నుంచి థియేటర్లకు, ఎగ్జిబిటర్లకు ఫోన్లు వెళ్లిపోయాయి. దీంతో చాలా థియేటర్ల దగ్గర రు. 5 – రు. 10 రేట్లు దర్శనమిస్తున్నాయి. ఎక్కువ రేట్లకు అమ్మితే చర్యలు తప్పవన్న వార్నింగ్‌లు వెళ్లిపోయాయట. ప్రీమియర్ షోలు లేవు. బెనిఫిట్ షోలు లేవు.. దీంతో ఏం జరుగుతుందా ? అన్న ఆందోళన అయితే ట్రేడ్‌లోనూ, పవన్ అభిమానుల్లోనూ ఉంది.
తొలి రోజే డిజాస్టర్ టాక్ తెచ్చేందుకు స్కెచ్…!
ఇవన్నీ ఇలా ఉంటే భీమ్లానాయక్‌కు తొలి రోజే డిజాస్టర్ టాక్ తెచ్చేందుకు వైసీపీ శ్రేణుల్లో కొందరు పనిగట్టుకుని కాచుకుని ఉన్నారట. ఈ విషయంలో ఆ పార్టీలో అందరిని ఒకేలా చూడకపోయినా కొందరు మాత్రం కసితో ఈ సినిమాకు ఉదయం నుంచే డిజాస్టర్ టాక్ స్ప్రెడ్ చేసేందుకు రెడీ అయ్యారట. ఇప్పుడు వైసీపీ గ్రూపుల్లోనూ, ఆ పార్టీలో కొందరు అభిమానుల మధ్య ఇదే విషయం స్ప్రెడ్ అవుతోంది. గతంలో నాని శ్యామ్‌సింగరాయ్ సినిమా విషయంలోనూ ఇదే జరిగింది. ఆ సినిమా బాగున్నా కూడా ఏపీలో ఈ తరహా ప్రచారంతో పాటు టిక్కెట్ రేట్ల తగ్గింపుతో వసూళ్ల పరంగా దెబ్బతింది. ఇప్పుడు భీమ్లానాయక్‌ను కూడా పనిగట్టుకుని ప్రచారం చేస్తున్నారు.
మనల్ని ఎవడ్రా ఆపేది అంటోన్న పవన్ ఫ్యాన్స్..
వైసీపీ అభిమానుల్లో కొందరు భీమ్లానాయక్‌ను టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తుంటే పవన్ అభిమానులు మాత్రం ఆగ్రహావేశాలతో రెచ్చిపోతున్నారు. మనల్ని ఎవడ్రా ఆపేది అంటూ వైసీపీలో తమ సినిమాకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నవారికి కౌంటర్లు ఇస్తున్నారు. ఏదేమైనా రేపు పవన్ ఏం చేస్తాడు ? సినిమా టాక్ ఎలా ఉంటుంది ? ఏపీలో ఏం జరుగుతుంది అన్నదే ఉత్కంఠగా ఉంది.