విజయ్ దళపతి.. కోలీవుడ్ స్టార్ హీరో అయినప్పటికీ టాలీవుడ్‌లోనూ భారీ క్రేజ్ సంపాదించుకున్న హీరోల్లో ఈయన ఒకరు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా పలు చిత్రాలు చేసిన విజయ్.. తన తండ్రి, ప్రముఖ దర్శకుడు ఎస్‌ఏ చంద్రశేఖర్ తెరకెక్కించిన `నాలయై తీర్పు` అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత ఒక్కో మెట్టు ఎక్కుతూ తమిళ సినీ పరిశ్రమలో స్టార్ స్టేటస్‌ను దక్కించుకున్న విజయ్.. 1999లో సంగీత అనే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు.
అయితే ఇంతకీ సంగీత ఎవరో కాదు.. విజయ్‌కు విరాభిమాని. అవును, అభిమానినే విజయ్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అసలు సంగీత, విజయ్‌లకు పరిచయం ఎప్పుడు, ఎక్కడ, ఎలా ఏర్పడిందో ఇప్పుడు తెలుసుకుందాం. సంగీతా లండన్‌లో స్థిరపడ్డ తమిళ కుటుంబం అమ్మాయి. అయితే విజయ్ సినిమాలు చూసి అతడికి విరాభిమానిగా మారింది. ఈ నేపథ్యంలోనే విజయ్‌ని చూడటానికి 1996లో లండన్ నుంచి చెన్నైకి వచ్చింది.
తెలిసిన వారి ద్వారా విజయ్‌ను కలిసింది. అయితే తొలి చూపులోనే సంగీతకు పడిపోయిన విజయ్.. ఆమెను తన ఇంటికి భోజనానికి ఆహ్వానించాడు. అలాగే ఫోన్ నెంబర్లు కూడా ఇచ్చిపుచ్చుకున్నారు. ఆ తర్వాత తరచూ ఫోన్‌లో మాట్లాడుకుంటుండగా ఇద్దరి అభిప్రాయాలు కలిశాయి. ఇక విజయ్ ఆహ్వానం మేరకు కొద్ది రోజుల తర్వాత సంగీత వారి ఇంటికి వెళ్లింది.
అక్కడ సంగీత తన ప్రవర్తనతో విజయ్ తల్లిదండ్రులను కూడా ఆకట్టుకుంది. దాంతో సంగీతను విజయ్ తండ్రి `మా వాడిని పెళ్లి చేసుకుంటావా?` అని అడిగేశారట. అందుకు ఆమె ఓకే చెప్పడంతో.. 1999 ఆగస్ట్ 25న వీరిద్దరికీ పెద్దలు ఘనంగా వివాహం జరిపించారు. ఈ దంపతులకు కొడుకు సంజయ్, కూతురు దివ్యలు జన్మించారు.