టాలీవుడ్ లో కలెక్షన్ కింగ్ మోహన్‌బాబు స్టైలే వేరు. ఆయన ఉన్నది ఉన్నట్టు ఓపెన్ గానే కుండబద్దలు కొట్టి వేస్తూ ఉంటారు. అందుకే మోహన్‌బాబుకు ఇండస్ట్రీలో మిత్రుల కన్నా.. శత్రువులు ఎక్కువ గా ఉన్నారని చాలామంది చెబుతూ ఉంటారు. మోహన్‌భాబు ముక్కోపి. ఆయన మనసులో ఏది దాచుకోకుండా చెప్పేస్తూ ఉంటారు. విలన్ గా తన సినిమా కెరీర్ ప్రారంభించిన మోహన్ బాబు ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగి శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్ స్థాపించి నిర్మాతగా ఎన్నో విజయవంతమైన చిత్రాలు నిర్మించారు. ఇక హీరోగా ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాల్లో నటించారు.
మోహన్‌బాబు ఎంతో మంది దర్శకుల సినిమాల్లో… ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో నటించి తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. ఒకప్పుడు మోహన్‌బాబు వరుస ఫ్లాపుల్లో ఉన్నారు. అదే సమయంలో దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు చిరంజీవి హీరోగా జగదేక వీరుడు అతిలోక సుందరి లాంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమా తెరకెక్కించారు. రాఘవేంద్ర రావు అంతటి సూపర్ డూపర్ హిట్ సినిమా తర్వాత మరో పెద్ద హీరోతో సినిమా చేయవచ్చు… కానీ ఆయన మోహన్ బాబుతో సినిమా చేయాలని పట్టుబట్టి మరీ అల్లుడుగారు సినిమా చేశారట.
ఆ సమయంలో ఇండస్ట్రీకి చెందిన కొందరు పెద్ద హిట్ కొట్టి ఉన్నావు ఎందుకు మోహన్‌బాబుతో నువ్వు సినిమాలు చేస్తున్నావు అని చెప్పారట. అయినా రాఘవేంద్రరావు మాత్రం అవేవీ పట్టించుకోకుండా కేవలం ముప్పై రెండు రోజుల్లో అల్లుడుగారు సినిమా కంప్లీట్ చేశారట. అల్లుడుగారు సినిమా సూపర్ డూపర్ హిట్ కావడంతో పాటు మోహన్ బాబు కెరీర్ కు మంచి టర్నింగ్ పాయింట్ గా మారింది. ఇరవై రెండు రోజుల పాటు సింగిల్ షెడ్యూల్ లో షూటింగ్ చేసిన రాఘవేంద్రరావు కేవలం 32 రోజుల్లోనే ఆ సినిమాను పూర్తి చేయడం విశేషం.
మద్రాసు నుంచి ట్రైన్ లో సెకండ్ క్లాస్‌లో సినిమా యూనిట్ ను తీసుకు వచ్చి చిత్తూరు జిల్లా తలకోనలో షూటింగ్ చేశామని మోహన్ బాబు చెప్పారు. తనతో సినిమాలు చేయవద్దని రాఘవేంద్ర రావుతో కొందరు చెప్పినా ఆయనా మాత్రం తనకు సినిమా చేసి సూపర్ హిట్ ఇచ్చారని చెప్పారు.. అయితే వాళ్ల పేర్లు మాత్రం ఆయన బయటపెట్టలేదు.