యువరత్న నందమూరి బాలకృష్ణ కెరీర్‌లో మంగమ్మగారి మనవడు సినిమాకు ప్రత్యేకమైన స్థానం. 365 రోజులు ఆడిన ఈ సినిమా బాలయ్య కెరీర్‌ను టాప్ గేర్‌లోకి తీసుకువెళ్లింది. భారతీరాజా తమిళంలో మణ్ వాసనై సినిమాను తీశారు. ఈ సినిమాను తెలుగులో కోడి రామకృష్ణ దర్శకత్వంలో మంగమ్మగారి మనవడు పేరుతో రీమేక్ చేశారు. తమిళంను మించి ఈ సినిమా డబుల్ హిట్ అయ్యింది. ఈ సినిమాలో కీలకమైన మంగమ్మ పాత్రను సీనియర్ నటిమణి భానుమతితో చేయించారు.
అయితే ఈ పాత్రను భానుమతిగారితో మాత్రమే చేయించాలని.. ఆమె ఒప్పుకోకపోతే ఈ సినిమాను వదిలివేయమని ఎన్టీఆర్ స్వయంగా చెప్పారట. అంతే కాదు ఎన్టీఆర్ ఫోన్ చేసి మరీ ఈ సినిమాలో భానుమతిని నటింపజేసేందుకు ఒప్పించారట. ఇక భానుమతి బహుముఖ నటి, ప్రజ్ఞాశాలి.. నిర్మాత, దర్శకురాలు కూడా.. అంతేకాదు స్టూడియో అధినేత్రి, రచయిత్రి, గాయని, సంగీత దర్శకురాలు.. ఇలా చెప్పుకుంటూ పోతే ఓ ఆల్‌రౌండర్.
అయితే వీటన్నింటికి మించి ఆమె మంచి మానవతా వాది.. ఆమె మానవ సంబంధాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఇక మంగమ్మగారి మనవడు రీమేక్ చేయాలనుకున్నాక.. సినిమా కాస్ట్, క్రూ సెట్ అయ్యాక.. ఎన్టీఆర్ బాలయ్యను పిలిచి మూడు విషయాలు చెప్పారట. వీటిని ఖచ్చితంగా పాటించాలన్న కండీషన్లు పెట్టారట. భానుమతి కంటే అరగంట ముందే షూటింగ్ వద్దకు వెళ్లి రెడీగా ఉండాలి.. ఏ ఒక్క రోజూ కూడా నీ వల్ల ఆమె వెయిట్ చేయకూడదని చెప్పారట.
భానుమతి సెట్స్‌లోకి రాగానే ఆమె కారు డోర్ నువ్వే తీయాలి.. ఆమె కారులో నుంచి దిగిన వెంటనే ఆమె కాళ్లకు నమస్కారం చేయాలని ఎన్టీఆర్ చెప్పారట. ఎన్టీఆర్ చెప్పినా.. చెప్పకపోయినా బాలయ్య సీనియర్లకు ఎంత మర్యాద ఇస్తారో తెలిసిందే. ఆ సినిమా షూటింగ్ జరిగినన్ని రోజులు బాలయ్య తండ్రి చెప్పినట్టే చేశారట. ఆ తర్వాత కూడా బాలయ్య – భానుమతి మధ్య బంధం అలాగే కొనసాగింది.