తెలుగు సినిమా పుట్టినప్పటి నుంచి నేటి వరకు ఏడు దశాబ్దాలు అవుతోంది. ఏడు దశాబ్దాలలో ఎంతో మంది హీరోయిన్లు రావటం… కనుమరుగవడం జరుగుతూ వస్తోంది. ఒకప్పుడు ఇండస్ట్రీలో తెలుగు హీరోయిన్లు ఎక్కువగా ఉండేవారు. అప్పట్లో స్టార్ హీరోల పక్కన తెలుగు హీరోయిన్లు నటించి సూపర్ డూపర్ హిట్ కొట్టారు. అయితే ఇప్పుడు కాలం మారుతోంది. అయితే తెలుగు సినిమా పరిశ్రమలో తొలి హీరోయిన్‌గా రాణించిన ఓ మహిళా స్టేజ్‌మీదే పుట్టిందట.
ఓ నాటకం జరుగుతుండగా ఆమె స్టేజ్ మీదే జన్మించిందట. ఆ నటి ఎవరో కాదు నేటి తరం ప్రేక్షకులకు తెలియని కమలాబాయి. తెలుగు సినిమా పరిశ్రమలో ఆమె మొదటి హీరోయిన్ గా పేరు ప్రఖ్యాతులు అందుకున్నారు. 1908వ సంవత్సరంలో సురభి నాటక సంస్థ గుంటూరులో నాటక ప్రదర్శనలు చేస్తున్న సమయంలో ఒకనటికి పురిటి నొప్పులు వచ్చాయి. దీంతో ఆ నాటక వేదిక మీద ఆ మహిళ ఓ ఆడబిడ్డకు ప్రసవించింది. ఆ బిడ్డ ఎవరో కాదు కమలాబాయి.
తెలుగు సినిమా పరిశ్రమలో ఆమె మొట్టమొదటి హీరోయిన్‌గా రికార్డులకు ఎక్కింది. ఆమెకు సహజనటిగా పేరు ఉండేది. భక్త ప్రహ్లాద సినిమాలో లీలావతి పాత్రలో ఆమె తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను మెప్పించింది. ఆమె నటనతో పాటు నాట్యకళలో కూడా రాణించింది. సినిమా రంగంలో ఎన్నో అవార్డులు రివార్డులు సొంతం చేసుకున్న కమలాబాయి హీరోయిన్ గానూ అటు మధురమైన గాత్రంతో తెలుగు ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసింది.
ఎన్టీఆర్ పాతాళభైరవి సినిమాలో తోట రాముడికి తల్లి పాత్రలో నటించింది. అలాగే 1953లో వచ్చిన అమ్మలక్కలు సినిమాలో కూడా కీలక పాత్రలో నటించింది. కమలాబాయి తెలుగుతో పాటు హిందీలో కూడా కొన్ని సినిమాల్లో నటించింది. తెలుగు సినిమా పరిశ్రమలో తొలి హీరోయిన్ గా రికార్డులకు ఎక్కిన ఆమె కెరీర్ చివరి దశలో అవకాశాలు లేక చాలా ఇబ్బందులు పడ్డారు. అయితే ఆమె ఇబ్బందుల్లో ఉన్న విషయం తెలుసుకున్న సీనియర్ ఎన్టీఆర్ ఆమెకు అండగా నిలబడ్డారు అని చెబుతారు.