టాలీవుడ్ లో ప్రస్తుతం ఉన్న యంగ్ హీరోలలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ దూసుకుపోతున్నాడు. అల వైకుంఠ పురంలో లాంటి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన బన్నీ ఇండస్ట్రీలో ఉన్న రికార్డులను తిరగరాశాడు. ఇక తాజాగా సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. విచిత్రమేంటంటే పుష్ప హిందీ వెర్షన్ ఏకంగా రు. 50 కోట్ల వసూళ్లు రాబట్టి అందరికీ షాక్ ల మీద షాక్ ఇస్తోంది. ఇక బన్నీ హీరోగా గంగోత్రి సినిమా తో వెండితెరకు పరిచయం అయ్యాడు. 2003లో ఈ సినిమా వచ్చింది.
చలసాని అశ్వనీదత్ – అల్లు అరవింద్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో గంగోత్రి తెరకెక్కింది. అదితి అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. ఇక బన్నీ హీరోగా అవ్వకముందు ఒక చిత్రమైన సంఘటన జరిగినదట. అప్పట్లో చెన్నైలో చిరంజీవి బర్త్ డే వేడుకలను వాళ్ళింట్లో చాలా ఘనంగా నిర్వహించే వారట. చిరు బర్త్ డే వచ్చిందంటే చాలు ఇంట్లో బంధువులు.. సన్నిహితులతో పెద్ద పండగ వాతావరణం ఉండేదట. ఒకసారి చిరు బర్త్ డే ఫంక్షన్ లో బన్నీ వేసిన డ్యాన్స్ చూసిన రాఘవేంద్రరావు మెస్మరైజ్ అయిపోయారట.
వెంటనే బన్నీ తల్లి దగ్గరికి వెళ్లి రు. 100 చేతిలో పెట్టి మీ అబ్బాయి పెద్దయ్యాక హీరోగా నేను సినిమా చూస్తున్నాను. ఇదిగో అడ్వాన్స్ అని చెప్పారట. ఆ సంఘటన జరిగిన పదేళ్లకు నిజంగానే రాఘవేంద్రరావు బన్నీతో గంగోత్రి సినిమా తీశారు. ఇక నాడు రాఘవేంద్రరావు… బన్నీ అమ్మ నిర్మలకు ఇచ్చిన వంద రూపాయలు ఇప్పటికీ అలాగే ఉన్నాయట. రాఘవేంద్రరావు షోలో పాల్గొన్న బన్నీ ఈ విషయాన్ని గుర్తు చేసుకున్నాడు.
ఇక మెగా ఫ్యామిలీతో రాఘవేంద్రరావుది ఎంతో ప్రత్యేకమైన అనుబంధం అన్న విషయం తెలిసిందే. బన్నీ తండ్రి గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ – రాఘవేంద్ర రావు కూడా ఎంతో సన్నిహితంగా ఉంటారు. ఇటు చిరు – రాఘవేంద్రుడి కాంబోలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. ఇక అరవింద్ తన కుమారుడిని హీరోగా పరిచయం చేసే బాధ్యతను కూడా రాఘవేంద్రరావు చేతుల్లోనే పెట్టారు. రాఘవేంద్రరావు తొలి సినిమాతోనే బన్నీకి మంచి హిట్ ఇచ్చారు.