2022 జనవరి 7… దేశవ్యాప్తంగానే కాక, ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది సినీ అభిమానులు ఎదురు చూసిన రోజు. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన త్రిబుల్ ఆర్ సినిమా రిలీజ్ అవ్వాల్సిన రోజు. టాలీవుడ్‌లోనే ఇద్దరు క్రేజీ హీరోలు యంగ్‌టైగర్ ఎన్టీఆర్, మెగావపర్‌స్టార్ రామ్‌చరణ్ కలిసి నటించిన ఈ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ రిలీజ్ కావాల్సిన రోజు. గత కొద్ది నెలలుగా ఊరిస్తూ ఊరిస్తూ వచ్చిన ఈ టీం సినిమాను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించి అందరిని తీవ్రంగా డిజప్పాయింట్ చేసింది.
ఈ రోజు త్రిబుల్ ఆర్ సినిమా రిలీజ్ అయ్యి ఉంటే ఈ పాటికే దేశం మొత్తం సోషల్ మీడియా అంతా ఈ సినిమా గురించి మార్మోగిపోతూ ఉండేది. ఆ స్థాయిలో ఈ సినిమాకు బజ్ క్రియేట్ అయ్యింది. అసలు నెల రోజులుగా ఈ సినిమా యూనిట్ అంతా ఏ స్థాయిలో ప్రమోషన్లు చేశారో చూస్తూనే ఉన్నాం. పది రోజుల ముందు వరకు కూడా ఈ సినిమాను పక్కాగా రిలీజ్ చేస్తున్నామని చెప్పి ఇంతోలనే షాక్ ఇచ్చారు.
త్రిపుల్ ఆర్ వాయిదా పడడంతో ఈ డేట్‌ను వాడుకునేందుకు మరో రెండు సినిమాలు థియేటర్లలోకి దిగుతున్నాయి. అందులో దగ్గుబాటి రానా నటించిన సినిమా ఒకటి. మరొకటి ఆది సాయికుమార్ సినిమా. విచిత్రం ఏంటంటే రానా నటించిన సినిమా ఈ రోజు రిలీజ్ అవుతుందన్న విషయం చాలా మందికి తెలియదు అనుకుంటే అసలు ఆ సినిమా టైటిల్ కూడా తెలియని వాళ్లు ఇండస్ట్రీలోనే చాలా మంది ఉన్నారు.
రానా నటించిన 1945 సినిమా.. ఎప్పుడో ఆరేళ్ల క్రితం నటించాడు. సీనియర్ నిర్మాత సీ కళ్యాణ్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమాకు తమిళ దర్శకుడు సత్యశివ రూపొందించారు. రెజీనా హీరోయిన్. రానాతో పాటు అసలు ఈ సినిమాను ఎవ్వరూ పట్టించుకోలేదు. చివరకు ఓ ప్రెస్‌మీట్ కూడా లేదు. ఇక వరుస ప్లాపులతో ఉన్న ఆది సాయికుమార్ నటించిన అతిథి దేవోభవ కూడా ఈ రోజే వస్తోంది.
విచిత్రం ఏంటంటే థియేటర్లలో సినిమాలేవి లేకపోవడంతో ఈ రెండు సినిమాలకు థియేటర్లు బాగానే దొరికాయి. ఏళ్లకు ఏళ్ల నుంచి ప్లాపుల్లో ఉన్న ఆదిసాయికుమార్‌కు అతిథి దేవోభవ అయినా హిట్ ఇస్తుందేమో ? చూడాలి. నాగేశ్వర్ అనే కొత్త దర్శకుడు తెరకెక్కించిన ఈ సినిమా ట్రైలర్ బాగానే ఉంది. మరి ఈ రెండు సినిమాలు ఏం చేస్తాయో ? చూడాలి.