1978లో సినిమా కెరీర్ ప్రారంభించిన మెగాస్టార్ చిరంజీవికి ఖైదీ సినిమాతో ఒక్కసారిగా కెరీర్ టర్న్ అయ్యింది. అప్పటివరకు చిరంజీవికి చాలా హిట్ సినిమాలు ఉన్నాయి. అయితే కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఖైదీ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. మాధవి – సుమలత హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాతో చిరంజీవికి తెలుగునాట తిరుగులేని మాస్ ఇమేజ్ వచ్చింది. ఈ సినిమా తరవాత చిరంజీవి మరో 20 సంవత్సరాల పాటు అసలు వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం కూడా లేదు. గ్యాంగ్‌లీడర్‌తో చిరు టాలీవుడ్ లో నెంబర్ వన్ హీరోగా ఎదిగిపోయారు.
చిరంజీవి కెరీర్లో 1987 నుంచి 1992 వరకు అసలు ప్లాప్ అన్నది లేకుండా ఆరు సంవత్సరాలపాటు వరుసగా హిట్ సినిమాలు వచ్చాయి. 1987లో గీతా ఆర్ట్స్ బ్యానర్ లో కోదండరామిరెడ్డి దర్శకత్వంలో పసివాడి ప్రాణం సినిమా వచ్చింది. చిరంజీవి – విజయశాంతి హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.
1988లో జి.నారాయణరావు & ఫ్రెండ్స్ నిర్మాణంలో రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో యముడికి మొగుడు సినిమా వచ్చింది. యముడు కథతో తెరకెక్కిన ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. చిరంజీవి – విజయశాంతి – రాధ హీరో హీరోయిన్లుగా నటించారు. 1989 గీతా ఆర్ట్స్ బ్యానర్లో కోదండరామిరెడ్డి దర్శకత్వంలో అత్తకు యముడు – అమ్మాయికి మొగుడు సినిమా వచ్చింది. చిరంజీవి – విజయశాంతి జంటగా ఈ సినిమా తెరకెక్కింది. అప్పట్లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.
ఇక 1990లో వైజయంతీ మూవీస్ బ్యానర్ పై చలసాని అశ్వనీదత్ నిర్మించిన జగదేకవీరుడు అతిలోకసుందరి రిలీజ్ అయింది. చిరంజీవి – శ్రీదేవి జంటగా నటించిన ఈ సినిమాకు రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు. అప్పటివరకు చిరంజీవి నటించిన సినిమాలకు భిన్నంగా ఒక సోషియో ఫాంటసీ కథాంశంతో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.
1991లో శ్యాంప్రసాద్ ఆర్ట్స్ బ్యానర్ పై మాగంటి రవీంద్రనాథ్ చౌదరి నిర్మాణంలో విజయబాపినీడు దర్శకత్వంలో గ్యాంగ్ లీడర్ సినిమా వచ్చింది. చిరంజీవి – విజయశాంతి జంటగా నటించిన ఈ సినిమా లో బప్పీలహరి మ్యూజిక్ పెద్ద హైలెట్ గా నిలిచింది. అప్పటివరకు ఉన్న రికార్డులు అన్నింటిని ఈ సినిమా బ్రేక్ చేసింది.
1992లో దేవి ఫిలిం ప్రొడక్షన్ బ్యానర్ పై కే దేవి వరప్రసాద్ నిర్మాతగా రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఘరానా మొగుడు సినిమా వచ్చింది. చిరంజీవి – నగ్మా – వాణి విశ్వనాథ్ హీరోయిన్లుగా నటించారు. చిరంజీవి తొలిసారిగా ఒక సినిమాకు కోటి రూపాయల రెమ్యునరేషన్ తీసుకున్న సినిమాగా ఘరానా మొగుడు రికార్డులకు ఎక్కింది. ఇలా వరుసగా ఆరు సంవత్సరాల పాటు అదిరిపోయే బ్లాక్ బస్టర్ హిట్లలో నటించిన చిరంజీవి టాలీవుడ్ లో అరుదైన రికార్డు సొంతం చేసుకున్నారు.