సింహ, లెజెండ్ తర్వాత బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన మూడో సినిమా అఖండ. ఈ కాంబినేషన్‌పై ముందు నుంచి ఉన్న క్రేజీ అంచనాలు నిజం చేస్తూ ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఇటీవలే అఖండ 103 కేంద్రాల్లో 50 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సినిమా అటు వెండితెరపై సంచలనాలు క్రియేట్ చేయడంతో పాటు ఇటు బుల్లితెర మీద కూడా రికార్డు వ్యూస్ కొల్లగొడుతోంది. డీస్నీ, హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అయిన అఖండ ఇక్కడ కూడా దూసుకు పోతోంది.
అఖండలో మురళీకృష్ణ అనే రైతు పాత్రతో పాటు అఘోరాగా బాలయ్య అదరగొట్టేశాడు. అసలు బాలయ్య అఘోరా పాత్రను చూసిన వారు అసలు ఆ పాత్ర బాలయ్య తప్పా ఇంకెవ్వరూ చేయలేరు.. ఇక చేయబోరు అని కితాబు ఇచ్చారు. ఆ వయస్సులో బాలయ్య ఆ పాత్ర, అంత రౌద్ర రసం పలికిస్తూ చేయడం అరాచకమే అని చెప్పాలి. ఈ సినిమా హిట్ జోష్‌లో ఉన్న బోయపాటి అఖండకు సీక్వెల్ వస్తుందని.. అఖండ 2 ఉంటుందని క్లారిటీ ఇచ్చేశాడు.
అఖండ 2 కథ ఇదేనంటూ ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. తొలి భాగంలో తల్లి నుంచి వేరయ్యాక అఖండ ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడు ? తల్లి కొడుకుపై ఉన్న ప్రేమను చంపుకోలేక తమ వద్దకు రమ్మని కోరడం, అఖండ అందుకు ఒప్పుకోకపోవడం.. తన కుటుంబం ఇబ్బందుల్లో ఉంటే అఖండ వచ్చి రక్షించడం జరిగింది. అయితే చివర్లో అఖండ వెళ్లిపోతూ మళ్లీ ఏదైనా సమస్య వస్తే తాను ఖచ్చితంగా వస్తానని చెప్పాడు.
దీంతో సెకండాఫ్‌లో కూడా మళ్లీ అఖండ కుటుంబం ముప్పు ఎదుర్కొంటే ఆ ముప్పు నుంచి అఖండ ఎలా కాపాడతాడు ? అనే అంశంతోనే ఈ పార్ట్ 2 తెరకెక్కుతుందని అంటున్నారు. సెకండ్ పార్ట్ ఎక్కువుగా అఖండ క్యారెక్టర్ మీదే నడుస్తుందని.. బోయపాటి ఇప్పటికే ఓ లైన్ అనుకోవడంతో పాటు దానిని కొంత వరకు డవలప్ చేసినట్టు అసిస్టెంట్ వర్గాల ద్వారా సమాచారం బయటకు పొక్కినట్టు తెలుస్తోంది. రెండో పార్ట్‌లో అఘోరాల గురించి మరింత డెప్త్‌గా సీన్లు ఉంటాయంటున్నారు.
ఏదేమైనా పైన చెప్పుకున్న కథకు బాలయ్య, బోయపాటి మార్క్ యాక్షన్ సీన్లు తోడైతే అఖండ 2లో కూడా ఈ కాంబినేషన్ మ్యాజిక్ రిపీట్ కావడంతో పాటు సూపర్ హిట్ అవుతుంది.