యువరత్న నందమూరి బాలకృష్ణ బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ బి.గోపాల్ కాంబినేషన్ కు ఎంత క్రేజ్ ఉండేదో తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్లో ఐదు సినిమాలు వస్తే నాలుగు సూపర్ డూపర్ హిట్ సినిమాలు. అందులో రెండు అయితే ఏకంగా తెలుగు సినిమా చరిత్ర గతినే మార్చేశాయి. బాలయ్య – బి.గోపాల్ కాంబినేషన్లో లారీ డ్రైవర్ – రౌడీ ఇన్స్పెక్టర్ – సమరసింహారెడ్డి – నరసింహనాయుడు – పలనాటి బ్రహ్మనాయుడు సినిమాలు వచ్చాయి. ఈ ఐదు సినిమాల్లో వచ్చిన పల్నాటి బ్రహ్మ నాయుడు సినిమా ఒకటే ప్లాప్ అయింది.
1999 సంక్రాంతి కానుకగా వచ్చిన సమరసింహా రెడ్డి సినిమా తెలుగు సినిమా స్టామినా ఏంటో దేశవ్యాప్తంగా చాటి చెప్పింది. ఆ తర్వాత 2001 లో వచ్చిన నరసింహ నాయుడు సినిమా ఏకంగా సంవత్సరం పాటు ఆడింది. భారతదేశ సినీ చరిత్రలో తొలిసారిగా వంద కేంద్రాల్లో 100 రోజులు ఆడిన సినిమాగా నరసింహనాయుడు రికార్డులకు ఎక్కింది. వీరిద్దరి కాంబినేషన్ కు ఎంత క్రేజ్ ఉందో పై సినిమాలే ఉదాహరణగా నిలుస్తాయి. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన రౌడీ ఇన్స్పెక్టర్ సినిమా సూపర్ హిట్ అయింది.
విజయలక్ష్మి ఆర్ట్ మూవీస్ బ్యానర్ పై నిర్మించిన ఈ సినిమాలో బాలయ్య పక్కన విజయశాంతి హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాలో బాలయ్య పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటించారు. బాలయ్య తన పాత్రలో లీనం అయిపోయేందుకు దర్శకుడు గోపాల్‌కే కండిషన్లు పెట్టారట. గెస్ట్ హౌస్ నుంచి ప్రతిరోజు షూటింగ్ స్పాట్ కు వచ్చేందుకు బాలయ్యకు ఏసీ జీప్ ఎరైంజ్ చేశారట. అయితే బాలయ్య మాత్రం తనకు పోలీస్ జీప్ కావాలని… తాను ప్రతి రోజు ఆ జీప్ లోనే షూటింగ్ స్పాట్‌కు వస్తాను అని దర్శకుడు గోపాల్ తో చెప్పారట.
తాను పోలీస్ పాత్రలో లీనం అయి నటించేందుకు పోలీస్ జీప్ లోనే వస్తానని చెప్పడంతో… చివరకు బాలయ్య కోరిక మేరకు పోలీస్ జీప్ తెప్పించారట. ఆ సినిమా షూటింగ్ అయ్యేవరకు బాలయ్య ఆ జీప్‌లోనే లొకేషన్‌కు వచ్చేవారు. రౌడీ ఇన్స్పెక్టర్ అప్పట్లోనే చాలా కేంద్రాల్లో 200 రోజులు ఆడటం విశేషం.
సినిమాలో విలన్ గా నటించిన మోహన్ రాజు తన తమ్ముడు సాయికుమార్‌ను పోలీస్ స్టేషన్ నుంచి విడుదల చేయించి తీసుకువెళ్లేందుకు అక్కడ కు వస్తాడు.
అప్పుడు బాలయ్య మోహన్ రాజుతో ఈ పోలీస్ డ్రెస్ తీసేస్తే నేను నీకంటే పెద్ద రౌడీని రా… ఏ సెంటర్ కి రాను జగదాంబ – సంగం – శరత్ అని చెప్పే డైలాగ్ అదిరిపోయింది అని… ఆ సీన్ లో బాలయ్యను చూస్తే తనకు సీనియర్ ఎన్టీఆర్ గుర్తుకు వచ్చారని గోపాల్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఆ సీన్స్ షూటింగ్ అయిన తర్వాత తాను బాలయ్య దగ్గరికి వెళ్లి బాబు నాకు మీ నాన్నగారు కనపడుతున్నారు అని చెప్పానని నాటి సంగతిని గుర్తు చేసుకున్నారు.