మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో మైలురాయిగా నిలిచిపోయిన సినిమాల్లో హిట్లర్ సినిమా ఒకటి. చిరంజీవి కెరీర్ పరంగా వరుస ఫ్లాపులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో చిరంజీవి కెరీర్‌ను టర్న్ చేసిన సినిమా హిట్లర్. ఈ సినిమా వచ్చి ఈ రోజుతో 25 సంవత్సరాలు పూర్తవుతుంది. 1997 జనవరి 4న సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఈ సినిమా అప్పట్లో సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ సినిమా గురించి తెరవెనక చాలా ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుందాం.
1996లో మమ్ముట్టి హీరోగా మలయాళ దర్శకుడు సిద్ధిఖీ దర్శకత్వంలో హిట్లర్ సినిమా నిర్మిస్తున్నారు. మలయాళంలో కూడా ఈ సినిమాకు హిట్లర్ అనే టైటిల్ పెట్టారు. అయితే ఈ సినిమా రిలీజయ్యాక ఎలా ఉంటుందో ? కూడా తెలియకుండానే ఎడిటర్, నిర్మాత మోహన్ తెలుగులో రీమేక్ చేయాలని రైట్స్ తీసుకున్నారు. ఈ సినిమా విడుదలకు ముందు రోజు రాత్రి ప్రముఖ రచయిత మరుధూరి రాజాతో కలిసి మోహన్ సినిమా చూశారట. ఆయనకు ఈ సినిమా బాగా నచ్చింది.
ఈ సినిమా చూసిన వెంటనే మోహన్ బాబు హీరోగా ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో తెలుగులో తెరకెక్కించాలని అనుకున్నారట. అయితే ఈవీవీ సత్యనారాయణ మాత్రం అప్పటికే మోహన్ బాబు రెండు సినిమాలు చేస్తున్నాడు… అని చెప్పడంతో చివరకు ఈ సినిమా చిరంజీవి చేతికి వచ్చింది. ఈ సినిమా చిరంజీవితో చేస్తున్నట్టు ఎడిటర్ మోహన్ చెప్పిన వెంటనే మరుధూరి రాజా చాలా హ్యాపీ ఫీలయ్యారట.
ఈ సినిమాకు ముత్యాల సుబ్బయ్య దర్శకుడిగా రాగా… రైటర్ గా ఎల్.బి.శ్రీరామ్ వచ్చారు. దీంతో మరుధూరి రాజా కాస్త బాధ పడినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇక తెలుగులో చిరంజీవి ఇమేజ్‌కు తగినట్టుగా మార్పులు చేసి ఈ సినిమాను సూపర్ హిట్ చేశారు. ఐదుగురు చెల్లెళ్ల అన్న సెంటిమెంట్‌తో వచ్చిన ఈ సినిమాలో పాటలు, కథ ఇవన్నీ సినిమాను సూపర్ హిట్ చేశాయి.