యువరత్న నందమూరి బాలకృష్ణ కెరీర్ లో ప్రతిష్టాత్మకంగా వందో సినిమాగా తెరకెక్కింది గౌతమీపుత్ర శాతకర్ణి. ఈ సినిమా 2017 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇదే సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా ఖైదీ నెంబర్ 150 కూడా రిలీజ్ అయింది. ఆ సినిమాకు పోటీ ఇచ్చి మరి శాతకర్ణి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. బాలయ్య తన కెరీర్లో వందో సినిమాను ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించాలని అనుకున్నారు. ఇందుకోసం ముందు చాలా కథలు విన్నారు. పలువురు దర్శకుల పేర్లు కూడా వినిపించాయి. ఒకానొక దశలో ఆదిత్య 369 కి సీక్వెల్ గా ఆదిత్య 999 బాలయ్య వందో సినిమాగా తెరకెక్కుతోందనిని ప్రచారం జరిగింది.
ఇక బాలయ్య వందో సినిమా కోసం బోయపాటి శ్రీను పేరు కూడా వినిపించింది. బాలయ్య కోసం బోయపాటి ఓ మాంచి యాక్షన్ కథ కూడా రెడీ చేసుకున్నారు. అయితే అప్పటికే బోయపాటి బాలయ్యకు సింహా, లెజెండ్ లాంటి మాస్ యాక్షన్ సినిమాలు చేసి ఉండడంతో బాలయ్య ఏదైనా కొత్త కథతోనే ఈ సినిమా చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే ఆంధ్రదేశాన్ని పాలించిన శాతవాహన చక్రవర్తి గౌతమీపుత్ర శాతకర్ణి జీవిత చరిత్ర ఆధారంగా ఆయన రాసుకున్న కథకు బాలయ్య మెస్మరైజ్ అయిపోయాడు.
అలా శాతకర్ణి తెరకెక్కింది. ముందుగా దేవీశ్రీప్రసాద్‌ను మ్యూజిక్ డైరెక్టర్‌గా తీసుకున్నారు. అయితే దేవిశ్రీ ఖైదీ నెంబర్ 150పై కాన్‌సంట్రేషన్ చేస్తూ శాతకర్ణి మ్యూజిక్ సిట్టింగ్‌లకు వరుసగా డుమ్మాలు కొడుతున్నాడన్న కారణంతో బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ చిరంతన్ భట్‌ను తీసుకున్నారు. ఇక హీరోయిన్‌గా నయనతార పేరు పరిశీలనకు వచ్చినా చివరకు శ్రేయ ఫైనలైజ్ అయ్యింది.
ఈ సినిమా రన్ టైం విషయంలో విచిత్రం జరిగింది. అసలు ఎడిటర్‌గా పెద్దగా పనిలేదు. క్రిష్ ముందే శాతకర్ణిని 2.10 గంటల రన్ టైంలో తీయాలని.. అంతే టైంలో తీశారు. దీంతో ఎడిటర్ కట్ చేసే అవకాశం కూడా లేదు. బాలయ్య శాతకర్ణిగా నట విశ్వరూపం చూపించేశారు. ఈ సినిమా ప్రారంభోత్సవానికి తెలంగాణ సీఎం కేసీఆర్‌తో పాటు సీనియర్ నటుడు వెంకటేష్, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు హాజరయ్యారు. కేసీఆర్ ఈ సినిమా రిలీజ్ అయ్యాక తనకు ప్రత్యేకంగా షో వేచి చూపించాలని బాలయ్యను రిక్వెస్ట్ చేశారు.
ఇక శాతకర్ణి రు. 60 కోట్ల పై చిలుకు షేర్ రాబట్టింది. తెలుగుదేశాన్ని పాలించిన చక్రవర్తి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కడంతో శాతకర్ణికి ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు వినోదపు పన్ను మినహాయించాయి. దీంతో షేర్ ఎక్కువ రావడంతో పాటు మంచి లాభాలు వచ్చాయి. ఇక ఈ సినిమాకు పోటీగా చిరు ఖైదీ నెంబర్ 150తో పాటు శర్వానంద్ శతమానం భవతి, పోసాని కానిస్టేబుల్ వెంకట్రామయ్య సినిమాలు కూడా వచ్చాయి. ఖైదీ నెంబర్ 150, శతమానం భవతి కూడా హిట్ అయ్యాయి.