ఒక భాషలో హిట్టైన చిత్రాన్ని ఇతర భాషల్లో రీమేక్ చేయడం ఇటీవల రోజుల్లో చాలా కామన్ అయిపోయింది. సీనియర్ హీరోలు, యంగ్ హీరోలు, స్టార్ హీరోలు అనే తేడా లేకుండా అందరూ రీమేక్ చిత్రాలపై తెగ మోజు పడుతున్నారు. టాలీవుడ్‌లోనూ వెంకటేష్, చిరంజీవి, పవన్ కళ్యాణ్ వంటి వారు రీమేక్ సినిమాలనే చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. దీంతో ఒరిజినెల్ కథల కంటే రీమేక్ చిత్రాలే ఈ మధ్య ఎక్కువగా విడుదల అవుతున్నాయి. ఇకపోతే రీమేక్ చిత్రాల హవా ఎప్పుడు మొదలైంది..? అసలు తెలుగులో రీమేక్ అయిన తొలి చిత్రం ఏది..? వంటి విషయాలు చాలా మందికి తెలీదు.
అయితే నిజానికి రీమేక్ సినిమా హవా ఈనాటిది కాదు.. 1950వ సంవత్సరంలో మొదలైంది. తెలుగుతో రీమేక్ అయిన తొలి చిత్రం `ఆహుతి`. హిందీలో విజయవంతమైన `నీరా ఔర్ నందా` సినిమాకు ఇది రీమేక్. ఆర్. ఎస్. జున్నాకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో జయసింహ, శశి, నిశి బరన్, జి. షావుకార్ కీలక పాత్రలను పోషించారు. ఈ సినిమా షూటింగ్ అంతా ఔట్ డోర్ లోనే జరగడం విశేషం.
నవీన ఫిల్మ్స్ బ్యానర్‌పై నిర్మితమైన ఈ చిత్రానికి సాలూరి రాజేశ్వరరావు సంగీతం అందించారు. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఈ సినిమాకు మాటలు పాటలు రాయడం ద్వారానే శ్రీ శ్రీ వెండితెరకు పరిచయమయ్యారు. కుల వివక్షతకు బలైన ప్రేమికులను ఆదర్శంగా తీసుకొని రూపుదిద్దుకున్న ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. ఇక అప్పటి నుంచి ఇతర దర్శకులు, నిర్మాతలు కూడా రిమేక్ సినిమాలు చేయడం ప్రారంభించారు.