ఈవీవీ సత్యనారాయణ తెలుగులో తనదైన స్టైల్ కామెడీతో సినిమాలు తీసి మెప్పించారు. తెలుగులో ఎంతో మంది గొప్ప దర్శకులు ఉన్నా కూడా ఈవీవీ స్టైల్ కామెడీ వేరు. ఈవీవీ చిన్న బడ్జెట్లో కూడా ఎన్నో పెద్ద హిట్ సినిమాలు ఇచ్చారు. అయితే చిన్న వయస్సులోనే ఆయన మృతి చెందడం బాధాకరం. ఈవీవీ తన ఇద్దరు కుమారులను హీరోలుగా పరిచయం చేశారు. ఇక తన చిన్న కుమారుడు నరేష్ అయితే అల్లరి సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి ఆ పేరుతో చివరకు అల్లరి నరేష్కూడా స్థిరపడిపోయాడు.
ఈవీవీ – అల్లరి నరేష్ కాంబినేషన్లో వచ్చిన కామెడీ సినిమాలో నరేష్ కెరీర్ ను ఓ రేంజ్లో మలుపు తిప్పాయి. అప్పట్లో రాజేంద్ర ప్రసాద్ తర్వాత ఆ స్థాయిలో కామెడీ పండించగల హీరోగా నరేష్‌కు పేరు వచ్చింది. ఇక నరేష్ అన్న ఆర్యన్ రాజేష్ కూడా ఈవీవీ దర్శకత్వంలో వచ్చిన హాయ్ సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. సురేష్ ప్రొడక్షన్ నిర్మించిన ఈ సినిమాలో నిఖిత హీరోయిన్గా పరిచయం అయ్యింది.
ఆ తర్వాత ఆర్యన్ రాజేష్ హీరోగా ఈవీవీ దర్శకత్వంలో వచ్చిన ఎవడిగోల వాడిదే సినిమా మంచి కామెడీ టైమింగ్ సినిమాగా తెరకెక్కి సూపర్ హిట్ అయ్యింది. ఇక ఆర్యన్ రాజేష్ సుభాషిణి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆమె ఈవీవీ స్నేహితుడి కుమార్తె. మొదటగా సుభాషిణి ఫొటో చూసిన ఆర్యన్ రాజేష్ ఆమెను పెళ్లి చేసుకునేందుకు ఒప్పుకోలేదట.
ఆ తర్వాత ఈవీవీ పట్టుబట్టడంతో పెళ్లి చూపులకు వెళ్లేందుకు ఆర్యన్ రాజేష్ ఒప్పుకున్నాడట. ఆమెను నేరుగా చూశాక.. తాను పెళ్లంటూ చేసుకుంటే ఆమెనే చేసుకుంటానని చెప్పేశాడట. 2011 జనవరి 5న వీరికి పెళ్లి చూపులు జరిగాయి. అయితే బ్యాడ్‌లక్ ఏంటంటే పెళ్లి చూపులు జరిగిన వారం రోజులకే జనవరి 11న ఈవీవీ మృతి చెందారు. ఆ టైంలో సుభాషిణి కుటుంబమే ఈవీవీ కుటుంబానికి అండగా నిలిచిందట. ఆ తర్వాత నరేష్ విజయవాడకు చెందిన ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్‌ను పెళ్లి చేసుకున్నాడు.