తెలుగు సినిమా రంగంలో 1960 – 1990 దశకాల మధ్యలో ఎన్టీఆర్ – ఏఎన్నార్ – కృష్ణ ముగ్గురు సినిమారంగాన్ని ఏలేసారు. అప్పట్లో ఈ ముగ్గురు స్టార్ హీరోలు ఏడాదికి నాలుగైదు సినిమాలు చేస్తూ బాక్సాఫీస్ ను ఎప్పుడూ కళకళ లాడేలా ఉంచేవారు. వీరు పోటాపోటీగా సినిమాలు తీసేవారు. ప్రారంభంలో ఈ ముగ్గురు హీరోల మధ్య మంచి వాతావరణం ఉండేది. అయితే తర్వాత ఎన్టీఆర్ కు పోటీగా సూపర్ స్టార్ కృష్ణ సినిమా రంగంలోనూ… ఇటు రాజకీయ రంగంలోనూ పైచేయి సాధించేందుకు ప్రయత్నించారు. ఎన్టీఆర్ సినిమాలకు పోటీగా కృష్ణ సినిమాలు రిలీజ్ చేసే వారు.
ఎన్టీఆర్ పౌరాణిక పాత్రలతో తెలుగు ప్రేక్షకులను మెప్పిస్తే… కృష్ణ కూడా పౌరాణిక పాత్రలు వేసేవారు.
ఎన్టీఆర్ దాన వీర శూర కర్ణ భారీ అంచనాలతో అప్పట్లో రిలీజ్ అయింది. అయితే కృష్ణ ఈ సినిమాకు పోటీగా కురుక్షేత్రం సినిమా రిలీజ్ చేశారు. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టి రాజకీయాల్లోకి వచ్చి ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత కృష్ణ కాంగ్రెస్‌లో చేరి ఎంపీగా పోటీ చేయడంతో పాటు ఎన్టీఆర్ ను టార్గెట్ చేస్తూ ప్రసంగాలు చేసేవారు.
ఎన్టీఆర్ 1989 ఎన్నికలలో ఓడిపోయారు. ఆ సమయంలో ఎన్టీఆర్ కు వ్యతిరేకంగా చాలా సినిమాలు వచ్చాయి. అందులో గండిపేట రహస్యం – రాజకీయ చదరంగం – మండలాధీశుడు – సాహసమే నా ఊపిరి లాంటి సినిమాలు వచ్చాయి. ఈ సినిమాలో కొన్ని సినిమాలను కృష్ణ నిర్మించగా… మరికొన్ని సినిమాల్లో ఆయన నటించారు. ఈ సినిమాలకు కృష్ణ భార్య విజయనిర్మల దర్శకత్వం వహించారు.
అప్పట్లో ఇవి రాజకీయవర్గాల్లో సంచలనానికి కారణం అయ్యాయి. ఈ సినిమాలు రిలీజ్ అయ్యాక దర్శకురాలు విజయనిర్మల ఎన్టీఆర్‌కు ఓ ఫంక్షన్‌లో తారసపడ్డారు. వెంటనే ఎన్టీఆర్ ఏవమ్మా నామీద తీయటానికి ఇంకా ఏమైనా మిగిలి ఉందా ? ఇంతేనా అని నవ్వుతూ సరదాగా అన్నారట. అప్పట్లో ఈ విషయం పెద్ద హాట్ టాపిక్‌గా నిలిచింది.