టాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఇండస్ట్రీలో ఓ సంచలన దర్శకుడు. ఎంత పెద్ద స్టార్ హీరోతో అయినా సినిమాను రెండు నుంచి మూడు నెలల్లో ఫినిష్ చేసేయడం పూర్తి స్టైల్. సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ దగ్గర 18వ అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన పూరి.. ఇండస్ట్రీలో దర్శకుడు కావడానికి ముందు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ఆ తర్వాత తొలి సినిమానే ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో చేసే లక్కీ ఛాన్స్ దక్కించుకున్నారు. పూరి తొలి సినిమా బద్రి సూపర్ హిట్. అప్పటి నుంచి పూరి వెనుదిరిగి చూసుకునే ఛాన్స్ రాలేదు.
బద్రి బ్లాక్‌బస్టర్ తర్వాత మహేష్‌బాబుతో పోకిరి, బిజినెస్‌మేన్, నాగార్జునతో సూపర్, శివమణి, అల్లు అర్జున్‌తో దేశముదురు, చరణ్‌తో చిరుత, బాలయ్యతో పైసా వసూల్, ఎన్టీఆర్‌తో ఆంధ్రావాలా, టెంపర్ ఇలా వరుస పెట్టి పెద్ద హీరోలతో సినిమాలు చేసుకుంటూ వచ్చాడు. ఇక వరుస ప్లాపుల తర్వాత రామ్‌తో ఇస్మార్ట్ శంకర్ లాంటి బ్లాక్‌బస్టర్ హిట్‌ను తెరకెక్కించి ఫామ్‌లోకి వచ్చాడు. ప్రస్తుతం రౌడీ హీరో విజయ్ దేవరకొండతో లైగర్ అనే పాన్ ఇండియా సినిమాను తెరకెక్కిస్తున్నాడు.
ఇక పూరి పెళ్లి కాస్త చిత్రంగానే జరిగింది. పూరి దర్శకుడు కావడానికి ముందే ఓ సినిమా షూటింగ్ జరుగుతుండగా అక్కడకు వచ్చిన లావణ్యను చూసి ప్రేమలో పడ్డాడట. అప్పుడు పూరి చేతిలో చిల్లిగవ్వ కూడా లేదట. ఇదంతా జరిగింది నాగార్జున నిన్నే పెళ్లాడతా షూటింగ్ టైంలో.. అప్పుడు పూరి కృష్ణవంశీ దగ్గర అసిస్టెంట్‌గా పని చేస్తున్నాడు. అప్పుడు పూరి పెళ్లి కొద్దిమంది సన్నిహితుల సమక్షంలో జరిగింది. హైదరాబాద్ ఎర్రగడ్డలోని ఓ గుడిలో ఈ పెళ్లి జరిగిందట.
స్నేహితులు అందరూ అండగా ఉండి పూరి పెళ్లి చేశారట. యాంకర్ ఝాన్సీ పూరికి పెళ్లికి తాళిబొట్టు కొనిచ్చిందట. మరో నటి హేమ పెళ్లి బట్టలు తీసుకువచ్చిందట. ఇక కొందరు స్నేహితులు కూల్ డ్రింక్స్ తీసుకువచ్చారట. అలా తాళి కట్టేసి, కూల్ డ్రింక్స్ తాగేసి.. సాయంత్రం షూటింగ్‌కు వెళ్లిపోయామని పూరి చెప్పాడు. పెళ్లయ్యాక కొద్ది రోజులు ఇబ్బంది పడినా తర్వాత పూరి డైరెక్టర్ అయ్యి… తిరుగులేని స్టార్ డైరెక్టర్ అయిపోయాడు.