యువరత్న నందమూరి బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబినేషన్లో మూడో సినిమాగావచ్చిన అఖండ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. వీరిద్దరి కాంబినేషన్లో గతంలో వచ్చిన సింహ – లెజెండ్ సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ఈ క్రమంలోనే అఖండ సినిమా రిలీజ్‌కు ముందు భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలు ఆ నిజం చేస్తూ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. డిసెంబర్ 2వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయిన అఖండ ఇప్పటి వరకు రు. 125 కోట్ల గ్రాస్ కొల్లగొట్టింది. అలాగే 70 కోట్ల షేర్ రాబట్టింది. ఇంకా నైజాంలో 60 – 70 సెంటర్లలో నడుస్తున్న అఖండ ఏపీలో కూడా పలు ప్రాంతాల్లో హౌస్ఫుల్ ఫుల్ షో లతో నడుస్తోంది.
ఈ క్రమంలోనే ఈ సినిమా ఇప్పుడు డిజిటల్ ప్రీమియర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది. అఖండ ప్రీమియర్ ను డిస్నీ + హాట్ స్టార్ జనవరి 21వ తేదీన స్ట్రీమింగ్ చేస్తున్నట్టు ప్రకటించింది.ఈ సినిమా ఓటీటీ రైట్స్ ను డిస్నీ + హాట్‌స్టార్ సొంతం చేసుకుంది. సంక్రాంతి కానుకగా జనవరి 14న ముందుగా స్ట్రీమింగ్ చేయాలని అనుకున్నారు. అయితే థియేటర్లలో అఖండ ఇంకా సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతుండడంతో నిర్మాత రవీందర్ రెడ్డి విజ్ఞప్తి మేరకు వారం రోజుల పాటు వాయిదా వేసింది.
ఈ విషయాన్ని డిస్నీ తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో ప్రకటించింది. తాజాగా అల్లు అర్జున్ బ్లాక్ బస్టర్ హిట్ మూవీ పుష్ప సినిమా కంటే రెండు వారాలు ముందుగా రిలీజయిన అఖండ… పుష్ప కంటే రెండు వారాలు ఆలస్యంగా ఓటీటీ లో ప్రసారం అవుతూ ఉండటం గమనార్హం. బాలయ్య కెరీర్లోనే తొలి వంద కోట్ల సినిమాగా కూడా అఖండ రికార్డులకు ఎక్కింది. మురళీకృష్ణ గా.. అఖండగా బాలయ్య రెండు పాత్రల్లో తన నట విశ్వరూపం చూపించారు.
ఇక అఖండను ఇప్పటికే బాలా ఎంజాయ్ చేస్తోన్న బాలయ్య అభిమానులు ఇప్పుడు ఓటీటీ డేట్ కూడా వచ్చేయడంతో మామూలుగా పండగ చేస్కోవడం లేదు.