యువరత్న నందమూరి బాలకృష్ణ కెరీర్‌లో మరపురాని సినిమాల్లో సమరసింహారెడ్డి ఒకటి. ఆ సినిమాకు ముందు వరకు బాలయ్య వరుస ప్లాపుల్లో ఉన్నారు. అప్పటికే బి.గోపాల్ బాలయ్య కాంబోలో రౌడీఇన్‌స్పెక్టర్, లారీడ్రైవర్ సినిమాలు వచ్చాయి. విజయేంద్రప్రసాద్ తయారు చేసిన కథ బాలయ్యకు నచ్చింది. నిర్మాతగా చెంగల వెంకట్రావు వచ్చారు. పరుచూరి బ్రదర్స్ మాటలు.
ముందుగా ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లను అనుకున్నారు. తర్వాత బాలయ్య మేనకోడలు పాత్రలో సంఘవి పాత్రను చేర్చడంతో పాటు ఓ పాట కూడా ఉండాలని అనుకున్నారు. ఇక అప్పటికే ప్రేమించుకుందాం రా, చూడాలని ఉంది సినిమాలతో తెలుగు ప్రేక్షకుల్లో క్రేజ్ ఉన్న అంజలా ఝవేరితో పాటు అప్పుడు ఫామ్‌లో ఉన్న సిమ్రాన్‌ను హీరోయిన్లుగా తీసుకున్నారు. ఇక సంఘవి మూడో హీరోయిన్.
1999 సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన సమరసింహారెడ్డికి పోటీగా మెగాస్టార్ చిరంజీవి స్నేహంకోసం సినిమా వచ్చింది. ముందుగా సమరసింహారెడ్డికి జస్ట్ హిట్ అన్న టాక్ వచ్చింది. ఆ తర్వాత క్రమక్రమంగా పుంజుకుంది. ఇక సీడెడ్‌లో అయితే 50 రోజులు దాటేసి… 100 రోజులు దాటిని కూడా జనాలు థియేటర్ల దగ్గర పోటెత్తేవారు. అందులో సీమ నేపథ్యం కావడంతో సీమ వాళ్లకు సమరసింహారెడ్డి పిచ్చపిచ్చగా నచ్చేసింది.
ఈ సినిమా ఆ రోజుల్లో లేట్‌రన్‌తో కలిసి 177 కేంద్రాల్లో 50 రోజులు ఆడింది. ఆ తర్వాత 73 కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకుంది. ఆ రోజుల్లో 73 కేంద్రాల్లో 100 రోజులు ఆడిన తొలి సినిమాగా రికార్డులకు ఎక్కింది. ఇక 30 కేంద్రాల్లో 175రోజులు తొలి భారతీయ సినిమా. అప్పట్లో 30 కేంద్రాల్లో ఓ సినిమా 175 రోజులు ఆడడం దేశవ్యాప్తంగానే సంచలనం రేపింది. ఇక లాంగ్ రన్‌లో 3 కేంద్రాల్లో 200 రోజులు ఆడింది. ఆ తర్వాత మళ్లీ తన నరసింహానాయుడు సినిమాతోనే బాలయ్య తన రికార్డును తానే బ్రేక్ చేసుకున్నారు.