తెలుగు సినిమా మార్కెట్‌ను మరో మెట్టు ఎక్కించిన సినిమా కచ్చితంగా సమరసింహారెడ్డి అని చెప్పాలి. 1999 సంక్రాంతి కానుకగా రిలీజైన ఈ సినిమా తెలుగు సినిమా రికార్డులను చెరిపేసింది. తెలుగు సినిమా మార్కెట్ సౌత్ ఇండియాలోనే టాప్ అని ప్రూవ్ చేసింది. బాలకృష్ణ – బి గోపాల్ కాంబినేషన్ లో తెరకెక్కిన సమరసింహారెడ్డి అప్పట్లోనే 77 కేంద్రాల్లో 100 రోజులు పూర్తి చేసుకుంది.
ఈ సినిమా స్టోరీ రైటర్ విజయేంద్ర ప్రసాద్ దర్శకుడు బి.గోపాల్ 1990 నుంచి సన్నిహితంగా ఉంటూ వచ్చేవారట. విజయేంద్రప్రసాద్ ఎన్ని కథలు చెప్పినా గోపాల్ కు నచ్చేవి కావట. దీంతో విజయేంద్ర ప్రసాద్ కు చికాకు వచ్చి గోపాల్ కు కథలు చెప్పటం మానేశారట. అయితే గోపాల్ దగ్గర పనిచేసే తోట రామకృష్ణ అనే అసిస్టెంట్ డైరెక్టర్ రిక్వెస్ట్ చేయడంతో మరోసారి విజయేంద్రప్రసాద్ బి.గోపాల్ దగ్గరకు వచ్చారట.
నేను ఎన్ని కథలు చెప్పినా మీకు నచ్చడం లేదు… అసలు మీ మనసులో ఎలాంటి కథ కావాలని కోరుకుంటున్నారు అని అడగడంతో పాటు… మీకు నచ్చిన ఏదైనా మంచి సినిమా చెప్పండి అని అడిగారట. దీంతో బి.గోపాల్ గుండమ్మ కథ , దుష్మణ్ రెండు సినిమాలు కలిపితే ఎలా ఉంటుందో అలాంటి కథ కావాలని అడిగారట.
గుండమ్మ కథ లాంటి ఫ్యామిలీ సినిమాతో పాటు దుష్మణ్ లాంటి యాక్షన్ సినిమాను మిక్స్ చేసిన స్టైల్లో పవర్ ఫుల్ కథ ఉండాలన్నది గోపాల్ కోరిక. ఆ మాట చెప్పాక కేవలం వారం రోజుల్లోనే విజయేంద్రప్రసాద్ సమరసింహారెడ్డి కథను రెడీ చేశాడట. ఆ కథను విన్న బి.గోపాల్ ఒక్కసారిగా మెస్మరైజ్ అయిపోయి బాలయ్య తోనే ఈ సినిమా చేయాలని నిర్ణయించుకున్నారట. వెంటనే చెన్నై వెళ్లి బాలయ్యకు కథను చెప్పి సినిమా ఓకే చేయించారట.