తెలుగు సినిమా రంగంలో ఎంత మంది హీరోయిన్లు వచ్చినా.. ఎన్ని దశాబ్దాలు గడుస్తున్నా కూడా ఇప్పటకీ మహానటి సావిత్రికి సాటిరాగల హీరోయిన్లు ఎవ్వరూ లేరు. ఆమె చనిపోయి దశాబ్దాలు అవుతున్నా కూడా ఆమె బయోపిక్ వస్తే జనాలు ఎగబడి చూసి మరీ ఆ సినిమాను బ్లాక్ బస్టర్ హిట్ చేశారు. సావిత్రి బయోపిక్ మహానటి తెలుగు సినిమా చరిత్రలో ఎప్పటకి మర్చిపోలేని సినిమాగా నిలిచిపోయింది. ఏపీలోని గుంటూరు జిల్లా చిర్రావూరులో జన్మించిన సావిత్రి తెలుగు, తమిళ భాషల్లో ఎందరో స్టార్ హీరోలతో నటించి ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు.
ఆమె కెరీర్ పీక్ స్టేజ్లో ఉండగా ఆమె చేసిన ఒకే ఒక తప్పు అప్పటికే పెళ్లయ్యి పిల్లలు ఉన్న జెమినీ గణేషన్‌ను పెళ్లి చేసుకోవడం. ఆ తప్పుకే ఆమె చాలా వరకు కుమిలిపోయి సగం మానసికంగా చచ్చిపోయింది. ఆమె అప్పట్లోనే కోట్లాది రూపాయల ఆస్తులు కూడబెట్టుకున్నారు. ఎప్పుడు అయితే జెమినీ గణేషన్‌ను సావిత్రి పెళ్లి చేసుకుందో అప్పటి నుంచే ఆమె కెరీర్ పతనం అవుతూ వచ్చింది. హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన ఆమె చివరకు మాదక ద్రవ్యాలకు బానిసై … కెరీర్ చివరి రోజుల్లో చాలా దుర్భర స్థితిలో చనిపోవడం నిజంగా బాధాకరం.
ఇక సావిత్రి నర్తనశాల సినిమా కోసం ఏకంగా 12 గంటల పాటు పనిచేశారట. ఇక సావిత్రి డైరెక్షన్‌లో వచ్చిన తొలి సినిమా చిన్నారి పాపలు. ఆమె వాటాదారులను నమ్ముకుని నిర్మాణంలోకి దిగారు. సినిమా షూటింగ్ సగం పూర్తయ్యాక ఆర్థిక ఇబ్బందులు రావడంతో పాటు వాటాదారులు హ్యాండ్ ఇచ్చారు. దీంతో సావిత్రి సొంత ఆస్తులు అమ్ముకుని మరీ ఆ సినిమాను పూర్తి చేశారు.
ఆ తర్వాత కూడా సావిత్రికి సొంత సినిమాలు కలిసి రాలేదు. వింత సంసారం, మూగమనసులు, కోలీవుడ్‌లో తెరకెక్కిన ప్రాప్తం సినిమాలు ఆమెకు ఆర్థికంగా నష్టాలు మిగిల్చాయి. అయితే విశ్వవిఖ్యాత రచయిత డీవి. నరసరాజు పదిమందితో కలిసి మరీ సావిత్రి ఇంటికి వెళ్లారట. ఆమెతో మీరు సినిమా నిర్మాణం జోలికి పోవద్దని చెప్పినా కూడా ఆమె వినలేదట. అలా ఈ సినిమాల నిర్మాణంతోనే ఆమె ఆర్థికంగా చాలా నష్టపోయారు. ఆ తర్వాత విపరీతమైన దానధర్మాలు చేయడం కూడా ఆమెను ఆర్థికంగా కోలుకోకుండా చేశాయి.