టాలీవుడ్ యంగ్‌టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్నాడు. ఎన్టీఆర్ తన కెరీర్లోనే ఎప్పుడూ లేనంత ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు. టెంపర్ సినిమా నుంచి వరుస హిట్లతో దూసుకుపోతున్న ఎన్టీఆర్ తన కెరీర్లోనే తొలిసారిగా పాన్ ఇండియా సినిమాగా వస్తోన్న ఆర్ ఆర్ ఆర్‌లో నటిస్తున్నాడు. ఆర్ ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ కు పాన్ ఇండియా ఇమేజ్ వస్తుందన్న అంచనాలు భారీగా ఉన్నాయి. సినిమా సినిమాకు నటనతో పాటు తన స్టేటస్ కూడా పెంచుకుంటూ వస్తున్న ఎన్టీఆర్ ఇప్పటి వరకు చేసిన సినిమాల్లో చాలా ప్రయోగాత్మక పాత్రలు చేశాడు.
యమదొంగ సినిమాలో యముడిగా – జై లవకుశ సినిమాలో మూడు పాత్రల్లో నటించడం – అదుర్స్ సినిమాలో రెండు పాత్రల్లో నటించడం – ఆది సినిమా పవర్ ఫుల్ యాక్షన్ లీడర్‌గా కనబడటం… ఇలా చాలా వైవిధ్యమైన పాత్రలు ఎన్టీఆర్ చేసుకుంటూ వచ్చాడు. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఏ హీరో నటించిన విధంగా నాలుగు సినిమాల్లో నటించాడు. తాజాగా ముంబైలో జరిగిన ట్రిపుల్ ఆర్ ప్రి రిలీజ్ ఈవెంట్‌లో జూనియర్ తన కెరీర్‌లో సినిమాల గురించి మాట్లాడుతూ తనకు ఇష్టమైన సినిమాలు ఏవన్న ప్రశ్నకు మూడు సినిమాలే చెప్పాడు.
అందులో మొదటి సినిమా అదుర్స్ అయితే ఆ తర్వాత జైలవకుశ, టెంపర్ సినిమాలు నచ్చుతాయని.. ఈ మూడు బెస్ట్ అని చెప్పాడు. అయితే ఇంతకన్నా హిట్ సినిమాలు చాలా ఉన్నా కూడా.. ఎన్టీఆర్ ఈ మూడు సినిమాల పేర్లే చెప్పడం.. అందులోనూ రాజమౌళి సినిమా ఒక్కటి కూడా లేకపోవడం కాస్త షాకే అనుకోవాలి. అదుర్స్ లో ఎన్టీఆర్ రెండు పాత్రల్లో నటించాడు. టెంపర్‌లో ఎన్టీఆర్ నటన అమేజింగ్. ఇక జైలవకుశ సినిమాలో మూడు పాత్రల్లో నటించి మెప్పించాడు. ఇందులో రావణ్ క్యారెక్టర్ ఇప్పటి తరం హీరోల్లో ఎవ్వరూ చేయలేరు.
ఇక ఆర్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. నందమూరి ఆర్ట్స్ – యువసుధా ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వచ్చే యేడాది దసరాకు ఈ సినిమాను రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు.