ప్రముఖ సినీ నటుడు అనంతపురం జిల్లా హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఇంటి వద్ద తీవ్రమైన ఉద్రిక్తత చోటు చేసుకుంది. బాలయ్య సొంత నియోజకవర్గమైన హిందూపురంలో అధికార వైసీపీ, విపక్ష టీడీపీ నేతల మధ్య గత కొద్ది రోజులుగా తీవ్రమైన మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ క్రమంలోనే ఈ రోజు వైసిపి కార్యకర్తలు హిందూపురంలో ఉన్న బాలకృష్ణ ఇంటిని ముట్టడించేందుకు భారీగా తరలి రావడంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. హిందూపురం పట్టణంలో డంపింగ్ యార్డ్ మార్పు అంశంపై టీడీపీ కార్యకర్తలు వైసీపీ ప్రభుత్వంపై తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు. ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు అవుతున్నా ఇప్పటివరకు హిందూపురం నియోజకవర్గానికి చేసిందేమీ లేదని టిడిపి కార్యకర్తలు ఆరోపించారు.
మరోవైపు హిందూపురం వైసీపీలో నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా ఉన్న ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ , నియోజకవర్గ మాజీ ఇన్చార్జి నవీన్ నిశ్చల్ మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. ఈ ఆధిపత్య పోరులో అసలు నియోజకవర్గంలో అభివృద్ధి లేదు సరికదా ? చిన్న చిన్న పనులు కూడా జరగడం లేదు. తాజాగా టిడిపి కార్యకర్తలు చేసిన ఆరోపణల నేపథ్యంలో వైసిపి కార్యకర్తలు బాలకృష్ణ ఇంటి వద్ద బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. ఈ క్రమంలోనే వైసీపీ కార్యకర్తలు భారీ ఎత్తున బాలకృష్ణ ఇంటిని ముట్టడించేందుకు వచ్చారు.
అటు టిడిపి కార్యకర్తలు కూడా తరలి రావడంతో బాలకృష్ణ ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దీంతో అక్కడ భారీగా పోలీసులు మోహరించారు.ప్రస్తుతం హిందూపురం వైసీపీ ఇన్చార్జిగా ఉన్న ఎమ్మెల్సీ ఇక్బాల్ ఆధ్వర్యంలో డంపింగ్ యార్డ్ ను మరో ప్రాంతానికి తరలించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన ఈ రెండున్నర సంవత్సరాలలో డంపింగ్ యార్డ్ మార్చడం మినహా.. ఏమాత్రం అభివృద్ధి జరగలేదని టిడిపి పార్లమెంట్ ఇన్చార్జి చంద్రమౌళి విమర్శించారు. దీంతో వైసిపి కార్యకర్తలు ఆందోళనకు దిగారు. టిడిపి కార్యకర్తలు కూడా అక్కడకు రావడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది.