కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కెరీర్లో ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. ఆ సినిమాలు అన్నింటికంటే అసెంబ్లీ రౌడీ సినిమాకు తెలుగు సినిమా చరిత్రలో ఎప్పటికీ ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఎన్నో సంచలనాలకు అసెంబ్లీరౌడీ కేంద్రబిందువు అయ్యింది. శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్ పై మోహన్‌బాబు నిర్మించిన ఈ సినిమాకు బి.గోపాల్ దర్శకత్వం వహించారు.
కోలీవుడ్‌లో సత్యరాజ్ హీరోగా శ్రీవాసు దర్శకత్వంలో వచ్చి సూపర్ హిట్ అయిన సినిమాకు రీమేక్ గా ఇక్కడ అసెంబ్లీ రౌడీ తెరకెక్కింది. అయితే ఈ సినిమా టైటిల్ అప్పట్లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీని మూడు రోజులపాటు కుదిపేసింది. కొందరు ఎమ్మెల్యేలు… తమకు వ్యతిరేకంగా ఈ సినిమా ఉందని అపోహ పడ్డారు. అసెంబ్లీ రౌడీ టైటిల్ ఎలా ? పెడతారని… ఈ సినిమాను బ్యాన్ చేయాలంటూ పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు.
అసెంబ్లీలో ఎమ్మెల్యేలుగా ఉన్న తామంతా రౌడీలమా ? అని మోహన్ బాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే అప్పుడు స్పీకర్ గా ఉన్నా ఆలపాటి ధర్మారావు ఈ సినిమాను వీక్షించారు. కేవలం టైటిల్ మాత్రమే అసెంబ్లీరౌడీ అని ఉందని… సినిమాలో ప్రజా ప్రతినిధులను కించపరిచేలా ఎలాంటి సీన్లు లేవని చెప్పడంతో… అప్పుడు ఎమ్మెల్యేలు శాంతించారు. అప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఎన్టీఆర్ ప్రతిపక్షంలో ఉన్నారు.
అయితే ఈ సినిమాపై అసెంబ్లీలో జరిగిన వ్యతిరేక ప్రచారం కాస్త… తమకు రూపాయి ఖర్చు లేకుండా పెద్ద పబ్లిసిటీ అయిందని… ఇది సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వడానికి ప్లస్ అయ్యిందని దర్శకుడు గోపాల్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. మోహన్‌బాబు డైలాగ్ డెలివరీ, దివ్య భారతి గ్లామర్, అప్పటికే సూపర్ హిట్ అయిన కథ, గోపాల్ టేకింగ్, పరుచూరు బ్రదర్స్ డైలాగులు ఈ సినిమాను ఓ రేంజ్లో నిలబెట్టాయి.