తెలుగు సినిమా చరిత్ర గురించి చెప్పాలంటే అందులో చాలా వరకు నందమూరి ఫ్యామిలీ చరిత్రే ఉంటుంది. అందులోనూ దివంగత నటరత్న ఎన్టీఆర్‌కే సగం పేజీలకు పైన కేటాయించేయాలి. ఎన్టీఆర్ లేకుండా తెలుగు సినిమా చరిత్రే కాదు.. తెలుగు జాతి చరిత్ర కూడా ఉండదంటే అతిశయోక్తి కాదనే చెప్పాలి. నాడు పల్లె ప్రజలకు మహాభారతం, రామాయణం, భాగవతంపై అవగాహన ఎక్కువ ఉండేది.
ఆ మూడు గ్రంథాల్లో పాపులర్ పాత్రలు అన్నింటిలోనూ ఎన్టీఆర్ నటించారు. అందుకే ఎన్టీఆర్ ప్రభావం వాళ్లపై అంతగా పడింది. అందుకే ఓ రాముడు, ఓ కృష్ణుడిని చూడాలంటే ఇప్పటకీ ఎన్టీఆర్‌ను ఆ గెటప్‌లో ఊహించుకుంటూ ఉంటారు. ఆ పాత్రలు ఎన్టీఆర్ చేశాక మరెవ్వరూ చేసినా వాటిని చూడలేకపోయారు. పౌరాణిక పాత్రల్లో ఎన్టీఆర్‌ను కొట్టే హీరోయే ఇప్పటి వరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో పుట్టలేదు.
అందుకే ఆయన అంటే ఇప్పటి తరాల వాళ్లు కూడా ఎంతో అభిమానం చూపిస్తారు. ఆయనపై అభిమానంతో ఎంతోమంది ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఓ అభిమాని తన ఇంటినే నటరత్న కళా మ్యూజియంగా మర్చేశారు. కాకినాడకు చెందిన పుచ్చకాయల చంద్రమౌళి. గంగరాజు నగర్లో నివాసం ఉంటారు. ఆయన మూడంతుస్తుల భవనంలో మూడో అంతస్తును కేవలం ఎన్టీఆర్ మ్యూజియం కోసం వదిలేశారు. ఆయన ఆ అంతస్తులో 7 అడుగుల ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేశారు.
ఇక ఎన్టీఆర్ నటించిన వివిధ సినిమాలకు సంబంధించిన పోస్టర్లు అన్ని అందులో ఉన్నాయి. ఎన్టీఆర్ జీవిత చరత్రకు సంబంధించిన పుస్తకాలు కూడా అందులో ఉన్నాయి. ఇక ఎన్టీఆర్ జయంతి, వర్థంతి సందర్భాల్లో ఆ మ్యూజియం ఎప్పుడూ కిటకిటలాడుతూ ఉంటుంది. ప్రస్తుతం ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు అక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ సందర్భంగా మ్యూజియం నిర్వాహకులు చంద్రమౌళి మాట్లాడుతూ తనకు చిన్నప్పటి నుంచే ఎన్టీఆర్ సినిమాలు చూడడం చాలా ఇష్టం అని.. రాజమండ్రి అశోక థియేటర్లో అన్న గారి సినిమాలు ఎక్కువుగా చూసేవాడిని అని.. ఆయనపై ఉన్న అనంతాభిమానమే ఈ రోజు ఆయన పేరుతో మ్యూజియం ఏర్పాటు అయ్యేలా చేసిందని ఆయన చెప్పారు.