టాలీవుడ్ మన్మధుడు నాగార్జున తన కెరీర్లో తొలిసారిగా ద్విపాత్రాభినయం చేసిన సినిమా హలో బ్రదర్. ఈవీవీ సత్యనారాయణ – నాగార్జున కాంబోలో వచ్చిన రెండో సినిమా ఇది. వీరిద్దరి కాంబినేషన్లో తొలిసారిగా వారసుడు సినిమా వచ్చి సూపర్ హిట్ అయింది. ఆ సినిమాలో నాగార్జున – కృష్ణ కలిసి నటించారు ఆ తర్వాత హలో బ్రదర్ రెండో సినిమాగా వస్తే… మరోసారి ఆవిడా మా ఆవిడే సినిమా కూడా వీరి కాంబినేషన్లో వచ్చింది. హలో బ్రదర్ లో తొలిసారిగా నాగార్జున సరసన సౌందర్య నటించింది.
ఈ సినిమా షూటింగ్ ముందుగా ప్రియరాగాలే అన్న పాట చిత్రీకరణతో మొదలైంది. అన్నపూర్ణ స్టూడియోలో ప్రత్యేకంగా వేసిన సెట్లో ఈ పాటను షూట్ చేశారు. ఈ పాట షూటింగ్ సమయంలోనే తొలిసారిగా నాగార్జున – సౌందర్య కలుసుకున్నారు. హలో బ్రదర్ సినిమా అప్పట్లో సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో పాటు నాగార్జున కెరీర్లో భారీ వసూళ్లు సాధించిన సినిమాగా రికార్డులకెక్కింది. నాగార్జున ఈ సినిమా ఒక పాత్రలో దొంగగా… మరో పాత్రలో పాప్ సింగర్ గా నటించారు. అయితే కొన్ని సన్నివేశాల్లో రెండు పాత్రలు కూడా కనిపిస్తాయి.
ఇలాంటి సన్నివేశాల్లో నాగార్జునకు డూప్‌గా నటించింది ఎవరో కాదు.. టాలీవుడ్ సీనియర్ హీరో శ్రీకాంత్. శ్రీకాంత్ .. నాగార్జున రెండో పాత్రలో నటించారు. నాగార్జున తొలిసారిగా పూర్తి స్థాయి కామెడీ పాత్ర పోషించారు. దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ తనదైన స్టైల్ కామెడీ మార్క్ తో సినిమాను తెరకెక్కించారు. అయితే ఈ సినిమా మీద ముందు నుంచి నాగార్జునకు అంత నమ్మకం ఉండేది కాదట.
హలో బ్రదర్ ఖచ్చితంగా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొడుతుందని అనేవారట. అయితే అంచనాలను తలకిందులు చేస్తూ హలో బ్రదర్ సూపర్ డూపర్ హిట్ అయింది. 1994లో రిలీజ్ అయినా హలో బ్రదర్ 70 కేంద్రాల్లో 50 రోజులు, 24 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై డాక్టర్ కె.ఎల్ నారాయణ ఈ సినిమాను నిర్మించారు.