అటు రాజకీయాల్లోనూ.. ఇటు సినిమాల్లోనూ సక్సెస్ అయిన అతి కొద్దిమంది వారిలో సీనియర్ ఎన్టీఆర్ ఒకరు. వెండితెరపై తిరుగు లేని రారాజుగా ఓ వెలుగు వెలిగిన ఎన్టీఆర్ ఆ తర్వాత రాజకీయ రంగంలోకి వచ్చారు. రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీని స్థాపించి కేవలం 9 నెలల్లోనే ముఖ్యమంత్రి అయ్యారు. ఎన్టీఆర్ ఎన్నో పౌరాణిక పాత్రలు వేసి తెలుగు ప్రజల హృదయాల్లో నిలిచిపోయారు. ఇక ఎంతో మంది దర్శకులతో కలిసి ఆయన పనిచేశారు.
కె. రాఘవేంద్రరావు, దాసరి నారాయణ రావు లాంటి వాళ్లతోనే కాకుండా పౌరాణిక, సాంఘీక పాత్రల్లో నటించాలన్న కోరికతో ఆయన ఎంతో మంది యువ దర్శకులను కూడా ఆ రోజుల్లో ఎంకరేజ్ చేసేవారు.
ఎన్టీఆర్ కి ఎంత మంది దర్శకులతో కలిసి నటించిన కూడా ఎన్టీఆర్ – విఠలాచార్య కాంబినేషన్ అంటేనే ఆ సినిమాలు అన్నీ కూడా ప్రత్యేకంగా ఉంటాయి. ఈ కాంబినేషన్లో సినిమా వస్తుందంటే చాలు అప్పట్లో ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉండేవి.
తక్కువ బడ్జెట్లోనే మంచి క్వాలిటీతో సూపర్ హిట్ సినిమాలు తీసిన ఘనత విఠలాచార్య సొంతం. మరో ఆ విషయం ఏంటంటే షూటింగ్ ప్రారంభించి రోజున విఠలాచార్య ఆ సినిమా విడుదల తేదీని ప్రకటించి… కచ్చితంగా అదే రిలీజ్ చేసేవారు. ఆయన నిర్మాతగా కూడా ఎన్నో సినిమాలు తీశారు. ఎన్టీఆర్ – విఠలాచార్య కాంబినేషన్ లో మొత్తం 14 సినిమాలు తెరకెక్కాయి.
ఈ సినిమాలలో 11 సినిమాలు సూపర్ హిట్ కాగా … మూడు సినిమాలు మాత్రం నిరాశపరిచాయి. విఠలాచార్య సినిమాలతో ఎన్టీఆర్ కు అదిరిపోయే మాస్ ఇమేజ్ వచ్చింది. వీరి కాంబోలో వచ్చిన అగ్గిపిడుగు అయితే అప్పట్లోనే ఐదు లక్షల రూపాయల వసూళ్లు రాబట్టింది. ఆ తర్వాత ఆలీబాబా 40 దొంగలు – పిడుగు రాముడు లాంటి సినిమాలు వీరి కాంబినేషన్లో వచ్చాయి. జానపద బ్రహ్మగా కీర్తిగడించిన విఠలాచార్య 1999వ సంవత్సరంలో మృతిచెందారు.