నేచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ శ్యామ్ సింగ రాయ్ ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చింది. ఇప్పటికే ఓవర్సీస్లో ప్రీమియర్ షోలు కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాకు హిట్ టాక్ కూడా వచ్చింది. ఇంకా చెప్పాలంటే అఖండ, పుష్ప సినిమాలను మించి యునానమస్ హిట్ టాక్ శ్యామ్‌సింగరాయ్ సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమాకు తొలి రోజే పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. ఏపీలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఈ సినిమా రిలీజ్ కావాల్సిన చాలా థియేటర్లను మూసి వేస్తున్నారు.
ఏపీ ప్రభుత్వం వర్సెస్ టాలీవుడ్ మధ్య జరుగుతోన్న ఫైట్‌లో భాగంగా గత రెండు రోజులుగా ఏపీలో ప్రభుత్వ యంత్రాంగం భారీస్థాయిలో థియేటర్లను తనిఖీలు చేస్తున్నారు. నిన్న ఒక్క రోజే తూర్పుగోదావరి జిల్లాలో 50కు పైగా థియేటర్లను మూసివేశారు. ఇందులో చాలా వరకు నాని సినిమా రిలీజ్ కావాల్సినవే. కృష్ణా, చిత్తూరు, ప్రకాశం, విజయనగరం, విశాఖ, శ్రీకాకుళంలో కూడా శ్యామ్‌సింగరాయ్ రిలీజ్ కావాల్సిన థియేటర్లలో నిబంధనలు సరిగా లేవని అధికారులు సీజ్ చేస్తున్నారు.
మరికొన్ని చోట్ల భారీ జరిమానాలు విధిస్తున్నారు. ఈ దెబ్బకు తట్టుకోలేక కొందరు యజమానాలు స్వచ్ఛందంగా సినిమాలు మూసివేస్తున్నారు. ఓవరాల్‌గా ఈ సినిమా రిలీజ్ కావాల్సిన పలు థియేటర్లు మూసివేయడం ఒక ఎదురు దెబ్బ అయితే.. నిన్న నాని ఏపీ ప్రభుత్వంను టార్గెట్ చేస్తూ మాట్లాడిన మాటలతో ఈ రోజు ఈ సినిమా రిలీజ్ అవుతోన్న థియేటర్లను ప్రభుత్వ యంత్రాగం మరింత గట్టిగా టార్గెట్ చేస్తోన్న పరిస్థితి.
పనికట్టుకుని శ్యామ్‌సింగరాయ్ రిలీజ్ కావాల్సిన థియేటర్లను తనిఖీలు చేసి.. ఏదో ఒక కారణంతో మూసివేయిస్తోన్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఏపీలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఈ సినిమాను నిర్మాతలు ఓన్‌గా రిలీజ్ చేసుకున్నారు. చాలా తక్కువ థియేటర్లలో ఈ సినిమా రిలీజ్ అవుతోంది. కొన్నేళ్లలో నాని నటించిన ఏ సినిమా కూడా ఇన్ని తక్కువ థియేటర్లలో అయితే రిలీజ్ కాలేదు.
నైజాంలో కేవలం 152 థియేటర్లలో వస్తోన్న సింగరాయ్ సీడెడ్‌లో 70, ఏపీలో 200 థియేటర్లలో వస్తోందని చెపుతున్నారు. అయితే ఏపీ, సీడెడ్‌లో ఈ సినిమా ఆడే థియేటర్లలో 50 మూతపడ్డాయని అంటున్నారు. అదే జరిగితే ఈ సినిమాకు ఎంత సూపర్ టాక్ వచ్చినా వసూళ్ల పరంగా భారీ నష్టం వాటిల్లక తప్పదు.